కవరేజీ ఇవ్వొద్దంటూ టీవీ చానళ్లను బెదిరించారు?

అవినీతికి పాల్ప‌డ్డార‌నే బూచిని చూపించి త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను అణ‌చివేద్దామ‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌య‌త్నిస్తోందంటూ ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మండిప‌డ్డారు. గుజ‌రాత్‌లో ఓడిపోతామ‌నే భ‌యం ప‌ట్టుకోవ‌డంవ‌ల్లే ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఢిల్లీలోని పార్టీ ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన జాతీయ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు.

ఆప్‌కు గుజ‌రాత్‌లో ఊహించ‌ని స్పంద‌న ల‌భిస్తోంద‌ని, త‌ము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. ఈ స్పంద‌న‌ను ఊహించ‌ని బీజేపీ పెద్ద‌లు తమను అణిచివేయడానికి అన్నిరకాల దారుల్లో ప్రయత్నిస్తున్నారన్నారు. గుజ‌రాత్‌లో ఆప్ కు క‌వ‌రేజీ ఇవ్వొద్దంటూ టీవీ ఛాన‌ళ్ల‌ను హిరేన్ జోషి బెదిరించార‌ని, వారు చెప్పిన‌ట్లు చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌న్నారని ఆరోపించారు.

ఇలాంటి చ‌ర్య‌లు మానుకోవాలంటూ కేజ్రీవాల్ మోడీకి హిత‌వు ప‌లికారు. టీవీ ఎడిట‌ర్ల‌కు జోషి పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు బ‌య‌ట‌కు వ‌స్తే ఆయ‌న‌తోపాటు మోడీ కూడా ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌లేర‌న్నారు. గుజరాత్ లో ఏర్పాటయ్యేది ఆప్ ప్రభుత్వమేనన్నారు. దేశవ్యాప్తంగా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ తమపై ఆరోపణలు చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే అతి పెద్ద అవినీతి ప్రభుత్వమన్నారు.