ఏపీ రాజధాని ఏదంటూ ఆటపట్టిస్తున్నారు: పిల్లలూ తలవంచాలా? అంటూ హైకోర్టు జడ్జీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమృతభారతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సామాన్యులను చైతన్య పరిచే గొప్ప మేధాశక్తి కలిగిన వాళ్లే రచయితలని ఆయన అన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలుగువాళ్ల పరిస్థితేంటో అందరూ పునరాలోచించుకోవాలన్నారు. గొప్పగా చెప్పుకోవచ్చు గానీ.. ఏం సాధించామని ప్రశ్నించారు. ఏపీ రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు హైకోర్టు జడ్జీ జస్టిస్ బట్టు దేవానంద్.

ఢిల్లీలో చదువుతున్న తమ అమ్మాయిని ‘మీ రాజధాని ఏది?’ అంటూ తోటి విద్యార్థులు ఆటపట్టిస్తున్నారన్నారు. మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితిలో ప్రస్తుతం తెలుగుజాతి ఉందని హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికీ కులం, రాజకీయం, స్వార్థం.. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉందని న్యాయమూర్తి దేవానంద్ గుర్తు చేశారు.

ఇది ఇలావుండగా, అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర బాపట్ల జిల్లాలోని నగరంలో కొనసాగుతుండగా వారికి టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. అమరావతే ఏపీ రాజధాని అని, రైతులు ఆందోళన చెందొద్దని ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాగా, మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. అమరావతే రాజధాని అని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయాని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. రైతులు అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు.

ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పు వెల్లడించిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటీ? అని జేసీ నిలదీశారు. రైతులను ఉత్తరాంధ్రకు వెళ్లవద్దని చెప్పడం సరికాదన్నారు. తమ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేయాలని రైతులను కోరుతున్నానని చెప్పారు. అమరావతి అన్ని ప్రాంతాలకు సమానం దూరంలో ఉంటుందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రైతులను మానసికంగా భయపెట్టాలని చూస్తున్నారని ఏపీ సర్కారుపై జేసీ ఆరోపించారు.