ఏపీ, తెలంగాణతోపాటు ఈ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.

కాగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ కొండలపై ఈ సీజన్‌లో తొలి మంచు కురిసింది. దీంతో ఉత్తరాఖండ్ పర్వతాల్లో చలి తీవ్రత పెరిగింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ధోరణి ఇప్పుడు మారిపోయింది. ఈ అల్పపీడనం ఇప్పుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిశగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మళ్లింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబరు 20 వరకు ఈ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం ఢిల్లీ-ఎన్సీఆర్‌లో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

ప్రైవేట్ వాతావరణ అంచనా ఏజెన్సీ స్కైమెట్ వెదర్ ప్రకారం.. ఈశాన్య ఉత్తరప్రదేశ్, బీహార్ ఉత్తర ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్-నికోబార్ దీవులలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, ఈశాన్య భారతం, గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలు, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కొంకణ్-గోవాలోని కొన్ని భాగాలు, దక్షిణ గుజరాత్, మహారాష్ట్ర, విదర్భ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జమ్మూ కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, లడఖ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, కర్ణాటకలోని అంతర్గత ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.