ఎన్టీఆర్‌ను లైన్‌లో పెడుతున్న వైసీపీ..!!

అమరావతి: టాలీవుడ్ సత్తాను చాటి చెప్పిన మూవీ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీస్టారర్, పీరియాడికల్ మూవీ ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికైందనే వార్తలు వెల్లువెత్తుతోన్నాయి. NTRNominatedForOscar2023 అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ లేదా రామ్‌చరణ్‌లల్లో ఒకరు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ను అందుకోవడం ఖాయమంటూ అభిమానులు అంచనా వేస్తోన్నారు.

హాలీవుడ్ సినిమాలు, టీవీ షో, టాక్ షో, రియాలిటీ షోలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వెరైటీ అనే వెబ్‌సైట్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. 2023 ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికయ్యే సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ కూడా ఉందని పేర్కొంది. మూడు కేటగిరీల్లో ఇది ఎంపికైందని తెలిపింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (దోస్తీ), బెస్ట్ యాక్టర్ (రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఆర్ఆర్ఆర్ మూవీని సెలెక్ట్ చేసినట్లు వెల్లడించింది.

ఇది తెలిసిన వెంటనే రామ్‌చరణ్, జూనియర్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎవరికి వారు తమ అభిమాన హీరో పేరును ట్రెండ్ చేస్తోన్నారు. NTRNominatedForOscar2023, RamcharanNominatedForOscar2023 హ్యాష్ ట్యాగ్స్‌పై వేలాది ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. వచ్చే సంవత్సరం మార్చి 12వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటామని చెబుతున్నారు.

కాగా- దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డు కోసం ఎంపికైనట్లు కొన్ని హాలీవుడ్ మేగజైన్లలో చూశానని చెప్పారు. ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొందని అన్నారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయని, ఇది మన తెలుగు చిత్ర స్థాయిని చాటి చెబుతోందని పేర్కొన్నారు.

RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంది. ఆస్కార్ బరిలో Jr.NTR, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా. pic.twitter.com/K4DFonbQQS

గిరిపుత్రులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.