ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలా.. అప్పుడే వేడుకలు జరపలా: రఘునందన్ రావు

కేసీఆర్, అసదుద్దీన్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైరయ్యారు. విమోచన దినోత్సవం జరుపుకోవడానికి మజ్లిస్ అనుమతి కావాలా అని అడిగారు. ఆయన ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంఐఎం అనుమతితో విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసింది సెక్యూలరిజమా? మతతత్వమా? సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తాననే సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడు, వేములవాడ ఉప ఎన్నికలతో మరో ఆర్ఆర్‌ బీజేపీ ఖాతాలో జమవుతాయన్నారు. వేములవాడ ఉపఎన్నిక తీర్పు వెంటనే ఇవ్వాలని రాజన్నను కోరానని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.

తెలంగాణ విమోచన దినోత్సవం శనివారం.. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు వేడుకలను జరపలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా వేడుకలను జరిపింది. సాయుధ పోరాటం జరిపిందే కమ్యూనిస్టులు అని సీపీఐ నారాయణ అంటున్నారు. మొత్తానికి తెలంగాణ యావత్ వేడుకలు జరుపుకుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ క్రమంలో రఘునందన్ రావు కూడా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.