ఆ ఉమ్మ‌డి జిల్లాలో వైసీపీ నుంచి వచ్చేవారి కోసం 2 సీట్ల కేటాయింపు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా రాజ‌కీయం చేస్తున్నారు. చివ‌రి వ‌ర‌కు సీటు విష‌యం తేల్చిచెప్ప‌రంటూ త‌న‌పై ఉన్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికా అన్న‌ట్లుగా ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. తనపై ఉన్న మ‌చ్చ‌ను చెరిపివేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్న‌డూ లేనివిధంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ వారికి కావ‌ల్సినంత స‌మ‌యాన్ని కూడా ఇస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిలుతో వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ఎవ‌రెవ‌రికి సీటు ఖ‌రారైందో చెబుతూ వారంతా ప‌నిచేసుకోవాలంటూ చెప్పి పంపిస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో పోటీచేసేది మీరేన‌ని అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దని స్పష్టతనిస్తున్నారు. తాజాగా ఆయ‌న దృష్టి ప్ర‌కాశం జిల్లాపై ప‌డింది. ఈ ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం 12 నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 8 మంది అభ్య‌ర్థులు ఖరారైన‌ట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ప్రకాశంలో ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, చీరాల, అద్దంకి, పర్చూరు, కనిగిరి, కొండెపి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలున్నాయి. వీరిలో పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండెపి నుంచి బాలవీరాంజనేయస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి పోటీచేయడం ఖాయమైంది. అలాగే సంతనూతలపాడులో బీఎన్ విజయ్ కుమార్, గిద్దలూరులో అశోక్ కుమార్, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, కనిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి ఇన్ఛార్జిలుగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో వారే పోటీచేయడం ఖాయమైది. సిట్టింగ్ లు ముగ్గురుతోపాటు ఈ ఐదుగురు కలిపి ఎనిమిది మంది అభ్యర్థులను పార్టీ ఫిక్స్ చేసింది.

ద‌ర్శిలో ప‌మిడి ర‌మేష్ ఇన్‌ఛార్జి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. వైసీపీ నుంచి వ‌చ్చే కీల‌క నేతకు ఆ సీటు ఇవ్వ‌నున్నారంటూ వార్తలు వ‌స్తున్నాయి. చీరాల‌లో ఎంఎం కొండ‌య్య‌, కందుకూరులో ఇంటూరి నాగేశ్వ‌ర‌రావు, ఎర్ర‌గొండ‌పాలెంలో ఎరిక్ష‌న్ బాబు ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జిలుగా కొనసాగుతున్నారు. వీరి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉండటంతో వీరికి ఇంకా ఖరారు కాలేదు. ఎర్రగొండపాలెంలో బాబుతోపాటు అజితారావు, వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని చూస్తున్న డేవిడ్ రాజు కూడా ఈ సీటు కోసం పోటీపడుతున్నారు. జనసేనతో పొత్తు కుదిరితే చీరాల నియోజకవర్గాన్నిఆ పార్టీకి కేటాయించే అవకాశం కనపడుతోంది.