ఆపరేషన్ మంగళగిరి… కౌంట్ డౌన్ స్టార్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి షెడ్యూల్ ప్ర‌కారం 2024లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తుకు వెళుతుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌లు జ‌ర‌గొచ్చు అనేలా రాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంది. వీటిని ఎదుర్కోవడానికి అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన కూడా త‌మ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నాయి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కుప్పంలో చంద్ర‌బాబునాయుణ్ని ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకు అవ‌స‌ర‌మైన అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు ఈనెల 22న శ్రీకారం చుట్ట‌బోతున్నారు. కుప్పంలో బాబును ఓడించ‌గ‌లిగితే రాష్ట్ర‌వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు డీలా ప‌డ‌తాయ‌ని, ఆ పార్టీకి విజ‌యం క‌ష్ట‌మ‌ని జగన్ భావిస్తున్నారు. ఇదే కోణంలో ఆయ‌న మ‌రో నియోజ‌క‌వ‌ర్గంపై కూడా దృష్టిపెట్టారు. రాజ‌ధానిలో భాగంగా ఉండి టీడీపీ, వైసీపీలకు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన మంగ‌ళ‌గిరి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీచేసిన తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి నారా లోకేష్ వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు.

ఈసారి ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నుంచే పోటీచేయ‌బోతున్నాన‌ని లోకేష్ ప్ర‌క‌టించారు. ఆ సవాల్ ను ఎదుర్కోవడానికి వైసీపీ కూడా సిద్ధ‌మైంది. జ‌గ‌న్ ”ఆప‌రేష‌న్ మంగ‌ళ‌గిరి”ని ప్రారంభించారు. నియోజకవర్గంలో వ్య‌తిరేత‌క‌ను ఎదుర్కొంటోన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని స‌త్తెన‌ప‌ల్లికి పంపిస్తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఆళ్ల‌ను స‌త్తెన‌ప‌ల్లికి పంపిస్తే ఇక్క‌డ ప్ర‌ధాన ఓటుబ్యాంకుగా ఉన్న ప‌ద్మ‌శాలీల నుంచే అభ్య‌ర్థిని ఎంపిచేస్తారని తెలుస్తోంది. ఇదే సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మురుగుడు హ‌నుమంత‌రావును తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చారు. 2014లో ఆళ్ల‌పై 12 ఓట్ల తేడాతో ఓట‌మిపాలైన టీడీపీ అభ్య‌ర్థి గంజి చిరంజీవిని తాజాగా పార్టీలోకి తీసుకున్నారు. మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలో వీరి ఓటింగ్ 50వేల వ‌ర‌కు ఉంటుంది. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన చిల్ల‌ప‌ల్లి మోహ‌న్‌రావు ఆప్కో చైర్మ‌న్ గా ఉన్నారు.

గంజి చిరంజీవిని వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా నియ‌మించారు. రానున్న ఎన్నిక‌ల్లో గుంప‌గుత్త‌గా ప‌ద్మ‌శాలీల ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి చిరంజీవినే వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌గిరి, తాడేపల్లిలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా చేప‌డుతోంది. రోడ్లు వేయించ‌డంతోపాటు సెంట్ర‌ల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా మ‌రో రూ.137 కోట్లను ప్రభుత్వం విడుద‌ల చేసింది. అభివృద్ధి పనులద్వారా నియోజకవర్గంలో న్యూట్రల్ గా ఉన్న ఓటర్లను కూడా వైసీపీవైపు మళ్లించాలనేది ముఖ్యమంత్రి జగన్ యోచనగా ఉంది. ఏదేమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం హోరాహోరీ పోరు తథ్యమని స్పష్టమవుతోంది.