అగ్ర నిర్మాతను బరిలోకి దింపుతున్న బీజేపీ

తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌తీయ జ‌న‌తాపార్టీ ప‌నిచేస్తోంది. అందుకు సెమీఫైన‌ల్‌గా మునుగోడు ఉప ఎన్నిక‌ను లక్ష్యంగా ఎంచుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోను అక్క‌డ గెలిచితీరాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రెండురోజుల‌పాటు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న మునుగోడుపై స‌మావేశం నిర్వ‌హించారు. అంతేకాకుండా రానున్న ఎన్నిక‌ల‌కు ఎలా సిద్ధ‌మ‌వ్వాలి? గుర్తించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల ఎంపిక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఆయ‌న ప్రత్యేకంగా చ‌ర్చించారు.

కొద్దిరోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో ప్ర‌తిభావంతులైన‌ వ్యక్తులతో బీజేపీ పెద్ద‌లు భేటీ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో భేటీ అయిన అమిత్ షా తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తో సమావేశమయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా యువ హీరో నితిన్ తో భేటీ అయ్యారు. వీరివల్ల పార్టీకి పునాదులు బ‌ల‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారిచేత ప్రచారం చేయించకోవాలనే యోచనలో కూడా ఢిల్లీ పెద్దలున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంనుంచి సినీ నిర్మాత‌ను బ‌రిలోకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌. ఆ చిత్రంలో వలసపోయిన కాశ్మీర్ పండిట్ల గాథను హృద్యంగా చిత్రించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పన్ను రాయితీ ఇచ్చారు. రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. తర్వాత ఆ నిర్మాత కృష్ణతత్వాన్ని ప్రధానాంశంగా పెట్టుకొని కార్తికేయ-2 నిర్మించారు. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది.

తొలిసారిగా రూ.100 కోట్ల క్లబ్బులో నిఖిల్ చేరడానికి దోహదపడింది. అభిషేక్ అగర్వాల్ తీసే చిత్రాలన్నీ హిందూ మతాన్ని పునాదిగా చేసుకొని ఉండటంతో తమ విజన్ కు అనుగుణంగా సినిమాలు చేస్తున్నాడని భావించిన బీజేపీ పెద్దలు నగరంలోని ఒక కీలకమైన నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. అభిషేక్ అగర్వాల్ గతంలో హిందూ పరిరక్షణ సంస్థలో పనిచేయడమేకాకుండా ఆర్ ఎస్ఎస్, వీహెచ్ పీతో అనుబంధం ఉంది. ప్రస్తుతానికి ఆ నియోజకవర్గం ఏమిటన్నది బయటకు రానప్పటికీ పోటీచేయడమైతే ఖాయమైంది.