అక్కడి నుంచి పోటీచేయాల‌నుకుంటున్నా: క‌ర‌ణం వెంక‌టేష్‌

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీచేయాల‌నుకుంటున్న‌ట్లు చీరాల వైసీపీ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌య‌మే శిరోధార్య‌మ‌ని, గ‌త ఎన్నిక‌ల్లో త‌న తండ్రి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఇక్కడి నుంచి విజ‌యం సాధించార‌ని, సీటిస్తే 2024 ఎన్నిక‌ల్లో తాను పోటీచేస్తాన‌న్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ 90 శాతానికి పైగా ప‌ద‌వుల‌ను కైవ‌సం చేసుకుంద‌ని, దీనిద్వారా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్నారు. అభివృద్ధిని ఒక ప్రాంతానికే ప‌రిమితం చేయ‌కుండా వికేంద్రీక‌ర‌ణ చేయాల‌న్న‌దే సీఎం ఉద్దేశ‌మ‌ని చెప్పారు.

మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయడ‌ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌న్నారు. వాలంటీర్లు, వార్డు స‌చివాల‌యాతో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేరువైంద‌ని, ఆర్థిక లోటున్నా ఒక్క ప‌థ‌కం కూడా ఆగ‌లేద‌ని, కొందరు ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని, అవి మానుకోవాల‌ని సూచించారు. రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఒంట‌రిగా పోటీచేసే ధైర్యం లేద‌ని, ప‌వ‌న్‌కల్యాణ్ తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీచేసి విజయం సాధిద్దామనే యోచనలో టీడీపీ నేతలున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప‌త‌నం ఎప్పుడోనే ప్రారంభమైందని, 2017లో అద్దంకిలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు మ‌ర‌ణిస్తే చంద్ర‌బాబుకానీ, లోకేష్ కానీ ప‌రామ‌ర్శించ‌డానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వారిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఆపలేరన్నారు.