Latest Posts

Rain alert: తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్: గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. అక్కడక్కడ వర్షాలు పడినా.. భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు. అయితే, బుధవారం నుంచి రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2-6 డిగ్రీల వరకూ తక్కువగా నమోదవుతోంది. నల్గొండ, ఖమ్మం మినహా మిగిలిన ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉందని తెలిపింది.

కాగా, రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతోపాటు నిజామాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. వాగులు, కాలువలు పొంగిపొర్లాయి. చాలా ప్రాంతాల్లో పంట పొలాలు వరదనీటిలో మునిగిపోయాయి. వర్షాల వల్ల నిర్మల్‌లో రోడ్డుపై వెళ్తున్న టాటాఏస్‌ వాహనంపై భారీ వృక్షం పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు కుంటాల జలపాతం వద్దకు వెళ్తుండగా.. ఖానాపూర్‌ మండలం ఎగ్బాల్‌పూర్‌ సమీపంలోకి రాగానే వాహనంపై భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భుచ్చన్న, రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ వర్షాలకు రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు వరదనీటిలో ఉన్నాయి. జోరు వానతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

Latest Posts

Don't Miss