Latest Posts

సీక్రెట్ ఆఫ్ ద రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ : కంప్లీట్ మెనూ ఇదే..!!

తిరువనంతపురం: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. ఈ నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఏడోరోజుకు చేరింది. ఈ ఉదయం నవయిక్కుళం నుంచి పాదయాత్రను ఆరంభించారు. అంతకుముందు- శివగిరి మఠాన్ని సందర్శించారు. శ్రీనారాయణ గురుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతి రోజూ సుమారు 25 కిలోమీటర్ల పాటు నడుస్తోన్నారాయన. ప్రతి ఒక్కరినీ పలకరిస్తోన్నారు. సెల్ఫీ దిగుతున్నారు. ఎనర్జిటిక్‌గా కనిపిస్తోన్నారు. తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి పౌష్టికాహారాన్ని తీసుకుంటోన్నారు. అలాగే- రోడ్డు పక్కన టీ తాగుతున్నారు. హోటళ్లకు వెళ్లి తనకిష్టమైన ఆహారాన్ని తింటున్నారు. ఉదయం టీ, బిస్కెట్లతో తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు రాహుల్ గాంధీ. గంట సేపు నడుస్తారు.

అనంతరం మూడు గంటల తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఇది తరచు రోజూ జరిగే ప్రక్రియ. మసాల దోసె, వడను అల్పాహారంగా తీసుకుంటున్నారు. కేరళలో అడుగుపెట్టిన తర్వాత మలయాళీ వంటకాలకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. దోసె, ఉప్మా, ఇడ్లీ ఆయన బ్రేక్ ఫాస్ట్ మెనూలో చేర్చారు. వెజ్, నాన్ వెంజ్ ఉంటోన్నాయి. మధ్యాహ్న భోజనంలో చేపల కూర తప్పనిసరి. చేపలతో పాటు శాకాహారం తప్పనిసరిగా తన మెనులో ఉండేలా ఏర్పాటు చేశామని ఫుడ్ కమిటీ పేర్కొంది.

సాయంత్రం తేలికపాటి ఆహారం, పండ్లను తీసుకుంటారు. రాత్రివేళ మితాహారాన్ని స్వీకరిస్తోన్నారు. చపాతి, అందులో పన్నీర్ కూరకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. రాహుల్ తన ప్రయాణంలో తరచూ జ్యూస్ తీసుకుంటుంటారని ఫుడ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. నూనెతో చేసిన వంటకాలకు దాదాపుగా దూరంగా ఉంటోన్నారని చెప్పారు. అలసటకు గురి చేసే ఆహారాన్నేదీ తీసుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ సాయంత్రం కొల్లం జిల్లాలోని పల్లిముక్ మదన్నాడలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర ముగంచనున్నారు.

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. 12 రాష్ట్రాల మీదుగా సాగుతుందీ యాత్ర. తమిళనాడులో ఆరంభమైన ఈ యాత్ర కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మీదుగా జమ్మూకాశ్మీర్‌కు చేరుకుంటుంది. శ్రీనగర్‌లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభతో తన యాత్రను ముగిస్తారు రాహుల్ గాంధీ. అత్యధికంగా కర్ణాటక, రాజస్థాన్‌లల్లో 21 రోజుల పాటు ఆయన యాత్ర కొనసాగుతుంది.

Latest Posts

Don't Miss