షర్మిల చేస్తున్న కామెంట్స్ వెనుక ఉన్న మతలబు ఏంటి?

తెలంగాణలో  పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల… టీఆర్ఎస్ నేతలకు టార్గెట్ అయ్యారా ?  సీఎం కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ షర్మిల చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయా?  షర్మిల కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్పీకర్ కు ఎందుకు  ఫిర్యాదు చేశారు? దీని వెనుక ఉన్న మతలబు ఏంటి?

తెలంగాణలో పాదయాత్రల కాలం నడుస్తోంది. ఓ వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలతో హీట్ పుట్టిస్తోంటే మరోవైపు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రతో హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే వైయస్ షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఆమె పాదయాత్రను మొదట్లో కొన్నిచోట్ల టిఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసిన పార్టీ ఆదేశాలతో ఆమెపై కామెంట్స్ ను లైట్ గా తీసుకున్నారు టీఆర్ఎస్ నేతలు. అనవసరంగా మాట్లాడి ఆమెను ఆమె పార్టీని పెద్దదిగా చేసినట్లు అవుతుందనేది టిఆర్ఎస్ పెద్దల భావన. దీంతో షర్మిల ఎన్ని విమర్శలు చేసిన టిఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించలేదు.

అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల… ఆ జిల్లా మంత్రి ఎమ్మెల్యేలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ఆమె కాలికి బలపం కట్టుకొని  పాదయాత్ర చేస్తున్నా   బండి సంజయ్ పాదయాత్రకు వచ్చినంత క్రేజ్ రావటం లేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే ఆమె మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. అయితే వనపర్తి లో పాద యాత్ర సందర్భంగా గతంలో తనపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను అడ్వాంటేజ్‌ను తీసుకుని తిట్ల దండకం మొదలు పెట్టారు. ఇప్పుడా తిట్లే షర్మిలకు మరింత ప్రచారం కల్పిస్తున్నాయి.

ఇక చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న  ప్రతినిధులు అనే స్పృహలేకుండా,  షర్మిల తమను అవమానిస్తోందని  మంత్రి నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును సీరియస్‌గా స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.  గులాబి నేతలిచ్చిన ఫిర్యాదును స్పీకర్ వెంటనే సభాహక్కుల ఉల్లంఘన కమిటికి పంపారు. అయితే స్పీకర్ సిఫారసు ఆధారంగా కమిటీ సమావేశమై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అయితే షర్మిల పాద యాత్ర స్టార్ట్ చేసిన నాటి నుంచి టిఆర్ఎస్ నేతలు టార్గెట్ గా విమర్శలు చేస్తున్నా.. ఇప్పుడే ఎందుకు టిఆర్ఎస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారన్న చర్చ జోరందుకుంది. స్థానిక నేతలు కొద్దిమంది షర్మిల వెంట పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే  తెలంగాణ రాజకీయాల్లో షర్మిలను టిఆర్ఎస్ ప్రోత్సహిస్తోందనే వాదన ఉంది. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండికొట్టే బాధ్యత షర్మిలకు అప్పగించారన్న వాదనా ఉంది. అందుకే  షర్మిలకు  హైప్ తెప్పించేందుకే టీఆర్ఎస్ నేతలు స్కెచ్ వేసారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.