కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని, తెలంగాణపై వివక్ష చూపిస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని, ఒకవేళ అమలు చేసినా అవి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటూ, కేంద్రం తమకు సహకరించడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విమర్శిస్తుంది. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
ఇదిలా ఉంటే ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం చేసింది ఏమీ లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులు చేస్తున్న వివిధ కార్యక్రమాలను గమనిస్తూ అందులో తప్పులను చూపిస్తూ టార్గెట్ చేస్తున్నారు.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుందని, గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి సామాన్యులపై భారం వేస్తుందని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యులకు అందని స్థితిలో పెరిగాయని, బీజేపీ ప్రభుత్వ హయాంలో సామాన్యులు బ్రతక లేని పరిస్థితి నెలకొందని ఇప్పటికే అనేక మార్లు గతానికి, ఇప్పటికి తేడాలు చూపిస్తూ పక్కా లెక్కలతో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఒక కార్యక్రమం ఆయనను టార్గెట్ చెయ్యటానికి ఆయుధం అయ్యింది.
The 3 elevators inaugurated at Sitaphalmandi Railway station is possibly this BJP MP’s biggest achievement in his constituency
Well done Kishan Anna in bringing such large projects from Govt of India 👏 https://t.co/DtxQtIz65r
ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో ఇటీవల మూడు ఎలివేటర్ లను ప్రారంభించారు. ఇక దీని పైన కూడా స్పందించిన మంత్రి కేటీఆర్ మంత్రి కిషన్ రెడ్డి ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి పై సెటైర్లు వేసిన కేటీఆర్ బీజేపీ ఎంపీ తన నియోజకవర్గానికి చేసిన గొప్ప పని ఇదేనని, సీతాఫల్మండి రైల్వే స్టేషన్ లో మూడు ఎలివేటర్ లను ప్రారంభించడమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చిన కిషనన్న వెల్ డన్ అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని అడుగుతుంటే, ఇక బీజేపీ మంత్రి రైల్వే స్టేషన్లలో లిఫ్ట్ లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ ఒక నెటిజన్ చేసిన సెటైర్ ను మంత్రి కేటీఆర్ తన పోస్ట్ కు ట్యాగ్ చేశారు.