Latest Posts

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐఆర్‌సిటిసి!

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐఆర్‌సిటిసి!

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐఆర్‌సిటిసి!

రైలు ప్ర‌యాణాలు ఇష్ట‌ప‌డ‌నివారు ఎవ‌రుంటారు చెప్పండి. అదీ కుటుంబ‌స‌మేతంగా టూర్ అంటే ఆ స‌ర‌దానే వేరు. అయితే, రైలు ప్ర‌యాణంలో ఆనందంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. రైలులో ఏం కోనాల‌న్నా.. ఏం తినాల‌న్నా.. బ్యాంక్ అకౌంట్‌లో కాదు, డ‌బ్బు చేతిలో ఉండాలి. ఎందుకంటే, డిజిట‌ల్ పేమెంట్స్‌కు రైలులో అవ‌కాశం ఉండ‌దు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) క్యూఆర్ కోడ్ పేమెంట్ సేవ‌లు అందుబాటులోకి తెస్తోంది. ఆ పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం..

రైళ్లల్లో ఆహారపదార్థాలు కొనుగోలు చేసేందుకు డిజిట‌ల్ పేమెంట్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే, ఇటీవ‌ల కాలంలో న‌గ‌దు చెల్లింపులు నేరుగా కంటే ఈ రూపంలోనే ఎక్కువ జ‌రుగుతున్నాయి. అంతేకాదు, రైలు ఆహారాన్ని అమ్మే ఐఆర్‌సీటీసీ వెండార్స్ అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని కూడా రైల్వేకు ప్రయాణికుల నుంచి ఎక్కువ సంఖ్య‌లో ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న భారతీయ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్తను అందించింది. ఐఆర్‌సిటిసి ఇటీవల రైళ్లల్లో పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ (QR Code Payment) సిస్టమ్ ప్రారంభించింది. నిజానికి, రైళ్ల‌లో కార్డ్ స్వైప్ చెల్లింపు సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నా, ఆ విషయం తెలియని ప్రయాణికులు నగదు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

  railway-packages-1    

మెనూలో ఎంత ఉంటుందో అంతే..

సంపూరణ్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మాత్రమే క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఒక రూట్‌లోనే అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ త్వరలో మరిన్ని రైళ్లల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ విధానం అందుబాటులోకి రానుంది. శతాబ్ది, తేజస్, దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లల్లో టికెట్ ఛార్జీల్లోనే కేటరింగ్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఇక కొన్ని రైళ్లల్లో ప్యాంట్రీ కార్ ఉన్నా ప్రయాణికులు నగదు రూపంలోనే చెల్లించాలి. ఇక ఐఆర్‌సీటీసీ వెండార్స్ సప్లై చేసే ఫుడ్‌కి సిబ్బంది డిజిటల్ పేమెంట్స్ అంగీకరిస్తే చెల్లింపులు చేయొచ్చు.

ఇప్పుడు క్యూఆర్ కార్డ్ చెల్లింపు విధానం ప్రవేశపెట్టడంతో ఆహార పదార్థాలపై అధిక ఛార్జీలు చేస్తే ఆ విషయాన్ని రైల్వే దృష్టికి తీసుకెళ్లడం ప్రయాణికులకు సులువవుతుంది. ఐఆర్‌సీటీసీ క్యూఆర్ కోడ్ మెను కార్డులపై ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెండార్స్ ఐడీ కార్డులపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనివ‌ల్ల ఎవ‌రైతే అధిక వ‌సూళ్ల‌కు పాల్ప‌డ‌తారో సులువుగా గుర్తించవ‌చ్చు. ప్రయాణికులు తమ యూపీఐ యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. మెనూలో ఎంత ఉంటుందో అంతే చెల్లించవచ్చు. ఐఆర్‌సీటీసీ వెండార్స్ అధికంగా వసూలు చేసే అవకాశం ఉండదు.

 irctc-tour-package-tariff-plan-15

ఇస్కాన్ టెంపుల్‌తో ఒప్పందం..

అంతేకాదు, ఇక‌నుంచి రైళ్లల్లో సంప్ర‌దాయ‌ ఆహారం అందించడానికి ఢిల్లీ ఇస్కాన్ టెంపుల్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ఐఆర్‌సీటీసీ. త్వరలో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో గోవింద రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇతర స్టేషన్‌లలో కూడా గోవింద రెస్టారెంట్లు ప్రారంభం కానున్నాయి. ఈ రెస్టారెంట్‌లోని మెనూలో డీలక్స్ థాలీ, మహారాజా థాలీ, వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ డిమ్ సమ్, పన్నీర్ డిమ్ సమ్, వోక్ టాస్ నూడుల్స్, దాల్ మఖానీ వంటి సంప్ర‌దాయ‌క వంటకాలు ఉన్నాయి.

ప్రయాణికులు రైలు బయల్దేరడానికి రెండు గంటల ముందు పీఎన్ఆర్ నెంబర్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. రైలు స్టేషన్‌కు చేరుకోగానే ప్రయాణికుల బెర్త్ వద్దకే ఫుడ్ డెలివరీ అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఆర్‌సిటిసి తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలతో ప్ర‌యాణికుల‌కు మ‌రింత చేరువ‌వుతుంద‌నే చెప్పాలి.

Latest Posts

Don't Miss