త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగు ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా తరువాత బన్నీతో చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. బన్నీ ఇప్పటికే ఒక మాటను త్రవిక్రమ్ చెవినకూడా పడేశాడని, దాదాపుగా ఇదే ఖాయమవుతుందని చెబుతున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌ది విజయవంతమైన కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంతో భారీ విజయాలను నమోదు చేసుకున్నారు. మరోవైపు మహేశ్ బాబు 28వ సినిమాను త్రివిక్రమ్ రూపొందించే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా వచ్చాయి. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది.
పుష్ప తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ చేయాల్సి ఉంది. అయితే ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన తర్వాత బోయపాటి సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నాడు. బోయపాటి ప్రస్తుతం రామ్ కథానాయకుడిగా ఒక సినిమా ప్రారంభించబోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. త్రివిక్రమ్ డైరెక్టర్‌గా చేయాలనుకుంటున్న సినిమా కూడా అన్ని భాషల్లో విడుదల చేస్తారని చెబుతున్నారు. బన్నీ పుష్ప, పుష్ప-2 నుంచి వరుసగా వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తాయని, ఆయన దగ్గరకు వచ్చే దర్శకులు కూడా అన్ని ప్రాంతాలు, అన్ని భాషల ప్రజలకు నచ్చే సబ్జెక్టులే తీసుకురావాలని బన్నీ కార్యాలయానికి చెందినవారు సూచిస్తున్నారు.
ఇప్పటికే బోయపాటి చెప్పిన సబ్జెక్టు కూడా పాన్ ఇండియా సజ్జెక్టేనని, కానీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ పై ఒత్తిడి ఎక్కువవడంతో సేఫ్టీ కోసం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నాడని సమాచారం. బోయపాటిది మాస్ సబ్జెక్టని, త్రివిక్రమ్ దగ్గర క్లాస్ సబ్జెక్ట్ ఉండటంతో అదే ఖాయమవుతుందని, వరుసగా రెండు మాస్ సినిమా చేసి ఉండటంతో విరామం ఇవ్వాలని బన్నీ భావిస్తున్నాడని, అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడని తెలుస్తోంది.