కీవే కె300 ఎన్ (Keeway K300 N) మరియు కీవే కె300 ఆర్ (Keeway K300 R) అనే రెండు మోడళ్లను కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో కె300 ఎన్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ స్టైల్ మోటార్‌సైకిల్ కాగా, కె300 ఆర్ దాని యొక్క ఫుల్లీ ఫెయిర్ట్ స్పోర్ట్స్ బైక్‌గా ఉంటుంది. ఈ రెండు మోడళ్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- కీవే కె300 ఎన్ – రూ.2.65 లక్షలు
- కీవే కె300 ఆర్ – రూ.2.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)
ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) యాజమాన్యంలో ఉన్న కీవే తాజాగా మర్కెట్లో విడుదల చేసిన ఈ 300 సీసీ ట్విన్ మోటార్‌సైకిళ్లను గమనిస్తే, ఇవి రెండూ డిజైన్ పరంగా వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఇంజన్ మరియు మెకానికల్స్ పరంగా దాదాపు రెండూ ఒకేలా ఉంటాయి. తక్కువ బాడీ ప్యానెల్స్‌తో నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిళ్లను కోరుకునే వారి కోసం కె300 ఎన్ను పరిచయం చేయగా, రేస్ స్టైల్ బైక్‌లను కోరుకునే యువత కోసం కె300 ఆర్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది.
కీవే విడుదల ఈ రెండు కొత్త మోటార్‌సైకిళ్ల కోసం ఇప్పుడు బుకింగ్‌లు కూడా ప్రారంభించబడ్డాయి ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించడం ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నుండి ఈ కొత్త బైక్‌ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. వీటిలో కీవె K300 N మ్యాట్ వైట్, మ్యాట్ రెడ్ మరియు మ్యాట్ బ్లాక్ కలర్లలో లభిస్తుండగా, K300 R గ్లోసీ వైట్, గ్లోసీ రెడ్ మరియు గ్లోసీ బ్లాక్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకేరకమైన 292.4సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. వీటి పవర్ టార్క్ గణాంకాలు కూడా ఒకేలా ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 27.1 బిహెచ్పి శక్తిని మరియు 25 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ తో కూడిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
మెకానికల్స్ విషయానికి వస్తే, కీవే కె300 ఎన్ ముందు భాగంలో గోల్డ్ కలర్లో తలక్రిందులుగా (అప్ సైడ్ డౌన్) ఫోర్కులను కలిగి ఉండగా, కీవే కె300ఆర్ బ్లాకర్ కలర్లో ఉండే ఫోర్కులను కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఒకేలా ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ రెండూ మోడళ్లలో ముందు వైపు 292మిమీ డిస్క్, వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.
కీవే కె300 ఎన్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ 1990 మిమీ పొడవు, 780 మిమీ వెడల్పు మరియు 1070 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ బైక్ వీల్‌బేస్ 1360 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 150 మిమీగా ఉంటుంది. దీని సీట్ హైట్ భూమి నుండి 795 మిమీ ఎత్తులో ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 151 కేజీలు మరియు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12.5 లీటర్లు. రెండు చక్రాలపై 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వీటిలో ముందు చక్రంపై 110/70-17 ప్రొఫైల్ టైరు మరియు వెనుక చక్రంపై 140/60-17 ప్రొఫైల్ టైరు ఉంటాయి.
కీవే కె300 ఆర్ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది 2010 మిమీ పొడవు, 750 మిమీ వెడల్పు మరియు 1080 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ బైక్ వీల్‌బేస్ 1360 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీగా ఉంటుంది. దీని సీట్ హైట్ భూమి నుండి 780 మిమీ ఎత్తులో ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 165 కేజీలు మరియు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. రెండు చక్రాలపై 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వీటిలో ముందు చక్రంపై 110/70-17 ప్రొఫైల్ టైరు మరియు వెనుక చక్రంపై 140/60-17 ప్రొఫైల్ టైరు ఉంటాయి.
ఈ కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ మాట్లాడుతూ, మార్కెట్లో సరికొత్త K300 N మరియు K300 R మోటార్‌సైకిళ్లను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ రెండు మోడళ్లు కూడా అద్భుతమైన డిజైన్, అందమైన లుక్స్ మరియు సాటిలేని పనితీరుతో వినియోగదారులను ఉర్రూతలూగించగలవని తాము హామీ ఇస్తున్నామని అన్నారు. ఈ ట్విన్ మోటార్‌సైకిళ్లు డిజైన్‌లో మరియు సరదాగా రైడ్ చేయడంలో విశిష్టమైన సబ్ 300 సిసి మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న యువ భారతీయ మోటార్‌సైకిల్ ఔత్సాహికులకు ఖచ్చితంగా నచ్చుతాయని చెప్పారు.
కీవే ఇండియా నుండి కొత్తగా వచ్చిన ఈ రెండు మోడళ్లతో భారత మార్కెట్లో ఈ బ్రాండ్ ప్రోడక్ట్ లైనప్‌లో టూవీలర్ల సంఖ్య 6 కి చేరుకుంది. దేశీయ విపణిలో కీవే అందిస్తున్న ఇతర మోడళ్ల ధరలు ఇలా ఉన్నాయి:
-
కీవే కె-లైట్ 250వి క్రూయిజర్ బైక్ – రూ.2.89 లక్షలు
-
కీవే వి302సి రోడ్‌స్టర్ బైక్ – రూ.3.89 లక్షలు
-
కీవే సిక్స్టీస్ 300ఐ క్లాసిక్ స్కూటర్ – రూ.2.99 లక్షలు
-
కీవే వీస్ట్ 300 మాక్సీ స్కూటర్ – రూ.2.99 లక్షలు
(అన్ని ప్రారంభ ధరలు, ఎక్స్-షోరూమ్ ఇండియా).