బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ ‘స్వాతిముత్యం’ సినిమాతో కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా విడుదలకు ముస్తాబైంది. మంచి విడుదల తేదీకోసమే దర్శక, నిర్మాతలు ఆగినట్లు తెలుస్తోంది. వారి కోరిక మేరకు ఈ సినిమాను అక్టోబరు ఐదోతేదీన దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ ను విడుదల చేశారు. కథానాయకుడు బెల్లంకొండ గణేష్ జన్మదినం 14వ తేదీ కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీడియోను వదిలారు. హీరో హీరోయిన్లకి సంబంధించిన సన్నివేశాలపైనే ట్రైలర్ రూపొందించారు. ప్రేమ, హాస్యం ప్రధానంగా ఉండబోతున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
గణేశ్ పక్కన కథానాయికగా వర్ష బొల్లమ్మ నటించింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, నరేష్, సురేఖావాణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. పూర్తిస్థాయి ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని సితార సంస్థ ప్రకటించింది. అక్టోబరు ఐదోతేదీన అగ్ర కథానాయకులు చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ తో బాక్సీఫీస్ వద్ద ఢీకొట్టబోతున్నారు. ఇటువంటి తరుణంలో అదేరోజున సినిమాను విడుదల చేస్తున్నట్లు సితార సంస్థ ప్రకటించడం ఫిలిం నగర్ లో చర్చనీయాంశమైంది.
చిరంజీవి, నాగార్జున సినిమాలుండగా అదేరోజు తమ చిత్రాన్ని విడుదల చేయాలని సితార సంస్థ భావిస్తోందంటే వారికి ఈ చిత్ర కథపై, దర్శకుడిపై అంత నమ్మకం ఉందని అర్థమవుతోందంటున్నారు. ఇద్దరు అగ్ర కథానాయకుల చిత్రాల మధ్య స్వాతిముత్యం విడుదల చేయడంవల్ల ఈ సినిమా ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదని, సహజంగా మీడియా ఈ రెండు సినిమాలతోపాటు తమ సినిమాను కూడా కవర్ చేస్తుందనే భావన ఉండటంవల్లే ఆరోజు విడుదలకు నిర్మాతలు మొగ్గుచూపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.