Latest Posts

బండి సంజయ్ తుపాకి రాముడు.. కూట్లో రాయి తియ్యలేని దద్దమ్మ: మంత్రి ఎర్రబెల్లి నిప్పులు!!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంలోని అధికార బీజేపీ పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు మీరు మేలు చేసే ఒక్క పని చేసినా సలాం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ కంటే మెరుగైన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే బిజెపి నేతలకు గులాం చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బీజేపీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు అని మండిపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, బండి సంజయ్ ని సైతం టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కూట్లో రాయి తీయలేని దద్దమ్మ రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. బండి సంజయ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని, ఆయన చెప్పేవన్నీ తుపాకి రాముడు కోతలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలో తిరగడం కాదు దమ్ముంటే ఢిల్లీలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధర్నా చేద్దాము రావాలని బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ లో ఏం చేశారో చెప్పాలని, ఏమి అభివృద్ధి చూపించాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీ అని మండిపడిన మంత్రి ఎర్రబెల్లి బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాలలోనే ఏ పనీ చేయలేని దద్దమ్మలు అంటూ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను నమ్ముకుంటే ఊదు కాలదు పీరు లేవదు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

పేదల గురించి ఆలోచించిన ఎన్టీఆర్, కేసీఆర్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని నరేంద్ర మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పెన్షన్ ఎంత వస్తుందో చెప్పాలని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే తక్కువ పెన్షన్లు వస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఆరు గంటలు మాత్రమే కరెంటు ఉంటుందని, పైగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టేదేలేదని మోడీకి చెప్పారని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.

Latest Posts

Don't Miss