ఏ రోటికాడ ఆ పాట పాడాలంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని భారతీయ జనతాపార్టీ నేతలు. ఎంత చేసినా ఏపీలో అధికారం రాదుకాబట్టి ప్రభుత్వంలోకానీ, పార్టీలోకానీ పదవుల విషయంలో ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని భావిస్తున్నారు. ఇక్కడి నాయకులకు కూడా ఏ అంశంపై ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో అర్థంకాని అయోమయావస్థకు చేరుకున్నారని, వారికి దిశ, నిర్ధేశం చేయాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అమరావతి రాజధానిగా ఉండే అంశంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమంటూ, ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని డిమాండ్ చేస్తూ అక్కడి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. కానీ అక్కడి రైతులు అడిగిన ప్రశ్నలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం చెప్పలేకపోయారు. ప్రస్తుతం రైతులు చేస్తున్న ‘అసెంబ్లీ టు అరసవెల్లి’ పాదయాత్రకు బీజేపీ జై కొట్టింది.
తాజాగా ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన బీజేపీ రాయలసీమ జోనల్ స్ధాయి సమావేశానికి సోము వీర్రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులోనే పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తామే తీసుకుంటామని ప్రకటించారు. దీనిమీద తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆయనే కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతు విశాఖపట్నాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని మరో డిమాండ్ చేశారు.
ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలంటున్నారు.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్‌ను వ్యతిరేకించడానికి కారణమేంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. కర్నూలు ప్రాంతంలో సమావేశం జరిగితే హైకోర్టు ఇక్కడే పెట్టాలని, ఉత్తరాంధ్ర వెళితే విశాఖను అభివృద్ధి చేయాలని, అమరావతి వెళితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం రాజధానుల అంశం తమ పరిధిలో లేదని హైకోర్టుకిచ్చిన అఫిడవిట్లలోనే స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ప్రజల ఆకాంక్షల ప్రకారం ఏదైతే రాజధానిగా కొనసాగుతుందో అదే రాజధాని అవుతుందనే విషయాన్ని మాత్రం ఆ పార్టీ నేతలు మరిచిపోవడం దురదృష్టమంటున్నారు.