భారత ప్రభుత్వం 1952లో చిరుతపులులను అంతరించిపోయిన జాతిగా అధికారికంగా ప్రకటించింది. అంతకు నాలుగు సంవత్సరాల ముందే ప్రస్తుత చత్తీస్గడ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చిరుతపులి మరణించింది. ఆ తర్వాత ఆనవాళ్లు లేవు. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకులు తీవ్రంగా కృషిచేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంది. దీంతో నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి.
అక్కడి నుంచి వీటిని తరలించడానికి ప్రత్యేకంగా బోయింగ్ విమానాన్ని తీర్చిదిద్దారు. 16 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈనెల 17న మనదేశంలోకి చిరుతపులి అడుగుపెట్టబోతోంది. బి747 జంబోజెట్ 5 ఆడ, 3 మగ చీతాలతో బయలుదేరి జైపూర్ లో దిగనుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లలో మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు వీటిని తరలిస్తారు. వీటి వయసు 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. వీటిని ప్రధానమంత్రి మోడీ కునో పార్కులోకి విడిచిపెడతారు.
వీటిని సౌకర్యవంతంగా పెంచేందుకు, ఆలనా పాలనా చూసేందుకు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. భారత్‌కు తరలించనున్న చీతాలకు వ్యాక్సినేషన్ కూడా పూర్తయింది. వేటాడే నైపుణ్యం, క్రూరత్వం, ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని జన్యు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకున్నారు. తొలుత నెలరోజులపాటు క్వారంటైన్ ఎన్క్లోజర్లలో ఉంచి తర్వాత వాటిని సాధారణ క్వారంటైన్‌కు తరలిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 7500 చీతాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
తొలిసారిగా 2009లో భారత్ కు చీతాలను రప్పించేందుకు భారతీయ వన్యప్రాణి సంరక్షకులు చీతా కన్జర్వేషన్ ఫండ్ కు సంబంధించిన ప్రతినిధులముందుంచారు. అనంతరం భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు డాక్టర్ మార్కర్ 12 సంవత్సరాల కాలంలో పలుమార్లు భారత్ ను సందర్శించారు. చీతాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ప్రాంతం, ప్రణాళికలను పరిశీలించారు. అంతరించినపోయిన వన్యప్రాణి జాతిని మనదేశంలోకి తిరిగి ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు చీతాకు సుప్రీంకోర్టు 2020లో ఆమోదించింది. చీతాలను సంరక్షించే అంశంపై నమీబియా, భారత్‌లు జులై 20వ తేదీన పరస్పరం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే 8 చీతాలను నమీబియా భారత్‌కు అప్పగించబోతోంది.