ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు తలపెట్టిన పాదయాత్ర 2.0 నాలుగోరోజుకు చేరింది. గుంటూరు జిల్లా పెదరావూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రైతులు బసచేసిన ప్రాంతం వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రైతులతోపాటు స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు పాదయాత్రలో కాలు కదిపారు.
దారిపొడవునా వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని మళ్లీ అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయడం సరికాదని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పోరాటం ఆపేదిలేదని తేల్చిచెప్పారు.
అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు అసెంబ్లీ నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వరకు ‘అసెంబ్లీ టు అరసవెల్లి’ పేరుతు 600 కిలోమీటర్లు, 60 రోజులపాటు పాదయాత్ర 2.0 ప్రారంభించారు.
ఇంతకుముందు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మొదటి విడత హైకోర్టు నుంచి అలిపిరి వరకు పాదయాత్ర చేశారు. రెండో విడత యాత్రలో రాజకీయ పార్టీలు ఎక్కువగా పాల్గొనబోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పాదయాత్ర చేసేలా ప్రణాళికలు రూపొందించారు.