Latest Posts

జమ్మూ కాశ్మీర్లో ఆగని తుపాకీల మోత: నౌగామ్ లో ఎన్‌కౌంటర్‌; ఇద్దరు ఉగ్రవాదుల హతం!!

జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి, దేశంలోకి చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పహారా ముమ్మరం చేశాయి. అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ ఉగ్రవాదుల ఏరివేత చేపట్టాయి.

ఈ క్రమంలో తాజాగా శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను శ్రీనగర్ పోలీసులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనే ఉగ్రవాద సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులను పుల్వామాకు చెందిన ఐజాజ్ రసూల్ నాజర్, షాహిద్ అహ్మద్ అలియాస్ అబూ హమ్జాగా పోలీసులు గుర్తించారు.

ఈ నెల ప్రారంభంలో పుల్వామాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడిపై దాడికి పాల్పడినవారు వీరేనని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 8.27 గంటలకు, కాశ్మీర్ జోన్ పోలీసులు వారికి అందిన కీలక సమాచారం ఆధారంగా కార్డెన్ సెర్చ్ కొనసాగిస్తున్న క్రమంలో శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునే క్రమంలో వారు పోలీసులపై కాల్పులు జరిపారని, తిరిగి పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.

రాత్రి 8.46 గంటలకు ఒక ఉగ్రవాది హతమయ్యాడని, రాత్రి 9.13 గంటలకు రెండో ఉగ్రవాది కూడా హతమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది మరణించి, భద్రతా సిబ్బంది గాయపడిన కొద్ది రోజుల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రస్తుతం ఇంకా శ్రీనగర్ జిల్లాలోని హెఫ్ షిర్మల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిత్యం ఉగ్రవాదుల, భద్రతా దళాలు మరియు పోలీసులు మధ్య కొనసాగుతున్న పోరులో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుపాకీల మోతతో గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లిపోతుంది.

Latest Posts

Don't Miss