కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు 12 ఏళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. విచారణ ఇప్పుడు ఏ దశలో ఉందో చెప్పాలని ఆదేశించింది. అదే సమయంలో విచారణ ఎందుకు ముందుగా జరగటం లేదో ఈనెల 19వ తేదీలోపు సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని ఆదేశించింది.
గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డితోపాటు మరో 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే కండీషన్ తో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిలు ఇచ్చింది. చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ జనార్దన్‌రెడ్డి 2020లో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన కొన్ని సడలింపులతో న్యాయస్థానం బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చంటూ అవకాశం కల్పించింది. ఈ సమయంలోనే బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మాధవి దివాన్ వాదనలు వినిపించారు. సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. విచారణ సాగడం లేదని మాధవి దివాన్ బదులిచ్చారు. కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాతా హైదరాబాద్ సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట విచారణ సాగకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో విచారణ ఏ దశలో ఉందో వివరిస్తూ.. విచారణ సాగకపోవడానికి కారణాలేమిటో తెలియజేయాలని నిర్దేశించింది. హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సీల్డ్ కవర్ నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించింది.