ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి కోన రఘుపతి తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆ పత్రాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మరో డిప్యూటీ స్పీకర్‌ను ప్రభుత్వం ఎన్నుకోనుంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గాన్ని మార్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు కూడా మారుస్తున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. జగన్ రాజీనామా చేయాలని కోరగా కోన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్ అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయాలనే యోచనలో ఉన్నారు. చీఫ్ విప్‌గా వ్రీకాంత్రెడ్డి స్థానంలో ప్రసాదరాజును నియమించడంతోపాటు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును ఎంపిక చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి నియమించనున్నట్లు తెలుస్తోంది. గత మంత్రి వర్గ విస్తరణ సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావును తొలగించిన తర్వాత ఆ సామాజికవర్గానికి అకాశం ఇవ్వలేదు.
వైశ్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అదే సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామిని నియమించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కోనతో రాజీనామా చేయించారు. ఆయన డిప్యూటీ స్పీకర్‌గా దాదాపు మూడున్నర సంవత్సరాలున్నారు. మరో ఏడాదిన్నర కోలగట్ల ఉంటారు. వైసీపీలో సీనియర్ నేత అయిన కోలగట్లకు గత మంత్రివర్గంలోనే స్థానం దక్కుతుందనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.
వైశ్య సామాజిక వర్గ కోణంలో అది వీలవలేదు. ఇప్పడు క్యాబినెట్ హోదాతో డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెడుతున్నారు. ఒకవేళ కోలగట్ల ఎంపికైతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉన్నట్లవుతుంది. గత సమావేశాల్లోనే కోలగట్లను ఎన్నుకుంటారనుకున్నప్పటికీ అప్పుడు కోన రాజీనామా చేయలేదు. దాంతో నోటిఫికేషన్ విడుదలవలేదు. ఇప్పుడు కోన రాజీనా చేయడంతో స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.