Latest Posts

ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ – రాజధానిపై నేడే సీఎం జగన్ ప్రకటన..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా మూడు రాజధానుల అంశం పైన ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని తెలుస్తోంది. మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం సభ ముందు ఉంచుతుందనే ప్రచారం సాగింది. కానీ, న్యాయపరంగా ఉన్న చిక్కుల కారణంగా.. ముందుగా మూడు రాజధానులు – అభివృద్ధి- పరిపాలనా వికేంద్రీకరణ తమ విధానమని మరోసారి సభ ద్వారా స్పష్టత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్దమైనట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు నిర్వహించే రోజులు..అజెండా పైనా నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో రాజధాని అంశం పైన చర్చకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బీఏసీకి సీఎం జగన్ తో పాటుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ప్రసాదరాజు, సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ తరఫున కింజరాజు అచ్చెన్నాయుడు పాల్గొంటారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు. సమావేశాల ప్రారంభ రోజునే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటగా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

అందులో భాగంగా.. గతంలో హైదరాబాద్ కేంద్రంగానే జరిగిన అభివ్రుద్ది..ఫలితంగా వచ్చిన ఉద్యమాల గురించి గుర్తు చేస్తూనే.. కేవలం అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్ లో వచ్చే ప్రాంతీయ అసమానతల గురించి వివరిస్తారని తెలుస్తోంది. దీని కారణంగానే అన్ని ప్రాంతాలను సమ కోణంలో చూస్తూ..రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనే లక్ష్యంో వికేంద్రీకరణ విధానంగా పని చేయనున్నట్లు సీఎం స్పష్టం చేస్తారని చెబుతున్నారు. దీంతో పాటుగా సమావేశాల్లొ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం ..అమలవుతున్న పథకాలు.. లబ్ది దారులకు జరుగుతున్న మేలు గురించి అంశాల వారీగా చర్చ చేయనున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అన్ని విమర్శలకు సభ నుంచే సమాధానం చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.

అందులో భాగంగా పోలవరం పైనా చర్చ ఉంటుందని తెలుస్తోంది. అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చ చేసింది. నిర్దిష్ఠ అంశాల పైన చర్చకు పట్టుబట్టాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రాజెక్టులు.. నిత్యావసర ధరలు.. నిరుద్యోగం, బాక్సైట్ అక్రమ మైనింగ్, పంచాయితీ నిధుల మళ్లింపు వంటి వాటితో పాటుగా 20 అంశాల పైన చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం రిఫరెండంగా భావిస్తే..అసెంబ్లీ రద్దు చేసి ఇదే అంశం పైన ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయటానికి సిద్దమైంది. దీంతో..అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానుల పైన ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో అధికార – ప్రతిపక్షాల ఎన్నికలకు సిద్దమవుతున్న సమయంలో జరుగుతున్న సమావేశాలు కావటంతో..రెండు వైపుల నుంచి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Latest Posts

Don't Miss