భారతదేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, కార్ల తయారీదారులు తమ ప్రస్తుత లైనప్‌లో రిఫ్రెష్డ్ మోడళ్లను మరియు పూర్తిగా సరికొత్త కార్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లో కొత్త 2022 మోడల్ బ్రెజ్జా, కొత్త తరం ఆల్టో కె10, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు సిట్రోయెన్ సి3 వంటి మోడళ్లు విడుదలయ్యాయి. ఈ మోడల్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
1. మారుతి సుజుకి ఆల్టో కె10
భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇటీవలే తమ పాత ఆల్టో కె10 మోడల్‌ను తిరిగి సరికొత్తగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఇప్పుడు ఇంజన్ మరియు ఎక్కువ ఫీచర్ల జాబితాతో అందుబాటులోకి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధరలు రూ.3.99 లక్షల నుండి రూ. 5.84 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది 4 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో స్టాండర్డ్ (O), LXi, VXi మరియు VXi+ వేరియంట్లు ఉన్నాయి.
విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ ప్లస్ అనే టాప్ 2 వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి. మొదటి రెండు బేస్ వేరియంట్లు మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తాయి. ఆసక్తిగల కస్టమర్లు కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10ని దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌లు మరియు అధికారిక వెబ్సైట్లో రూ. 11,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ కోసం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కూడా లేదు, చాలా డీలర్‌షిప్‌లలో ఇధి సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, దీనిని మీరు దీపావళి సమయంలో కొనుగోలు చేస్తే, వెంటనే డెలివరీ కూడా తీసుకోవచ్చు.
2. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా
మారుతి సుజుకి ఈ ఏడాది జులై నెలలో తమ బ్రెజ్జా ఎస్‌యూవీలో కొత్త 2022 రిఫ్రెష్డ్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ కోసం ఇప్పటికే 1 లక్షకు పైగా బుకింగ్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో ప్రారంభించిన కొద్ది నెలల్లోనే, ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా అవతరించింది. ఈ కొత్త 2022 మోడల్ మునుపటి కంటే రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది. భారత మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 7.99 లక్షల నుండి రూ.13.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఒకవేళ మీరు పండుగ సీజన్లో ఈ కారును డెలివరీ తీసుకోవాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త 2022 మోడల్ మారుతి బ్రెజ్జాలో కంపెనీ అందిస్తున్న ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్, డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ట్రిమ్‌లపై ఉండే సిల్వర్ యాక్సెంట్స్, పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్, వెనుక ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, వాయిస్ కమాండ్ సపోర్ట్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, హెడ్స్ అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, యూఎస్బి టైప్-సి రియర్ ఛార్జింగ్ పోర్ట్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉన్నాయి.
3. మారుతి సుజుకి గ్రాండ్ విటారా
మారుతి సుజుకి నుండి వచ్చిన మొట్టమొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు గ్రాండ్ విటారా. బ్రెజ్జా ప్లాట్‌ఫామ్ ఆధారంగా టొయోటా సహకారంతో తయారు చేసిన పెద్ద ఎస్యూవీ ఇది. బ్రెజ్జా మోడల్ కన్నా పెద్ద కారును మరియు ఎక్కువ మైలేజీనిచ్చే ఎస్‌యూవీని కోరుకునే వారు గ్రాండ్ విటారాను ఎంచుకోవచ్చు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలను కంపెనీ మరికొద్ది రోజుల్లోనే వెల్లడించనుంది. అయితే, ఈలోగా కంపెనీ ఈ ఎస్యూవీ కోసం రూ.11,000 టోకెన్ అడ్వాన్సుతో బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.
మారుతి సుజుకి యొక్క ప్రీమియం డీలర్షిప్ కేంద్రాలయిన నెక్సా ద్వారా గ్రాండ్ విటారా అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఇది అధికారికంగా అందుబాటులోకి రానుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం ఇప్పటికే 55,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చినట్లు సమాచారం. కాబట్టి మీరు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, వీలైనంత త్వరగా బుక్ చేసుకొని, ముందస్తు డెలివరీ కోసం క్యూలో వేచి ఉండటం మంచిది.
4. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాదిరిగానే టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా హైబ్రిడ్ ఎస్యూవీ. వాస్తవానికి, ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫామ్‌ను మరియు పవర్ట్రైన్ (ఇంజన్) లను పంచుకుంటాయి. మారుతి గ్రాండ్ విటారా తక్కువ ధరను కలిగి ఉంటే, టొయోటా హైరైడర్ ప్రీమియంగా ఉండి, ఎక్కువ ధరను కలిగి ఉండనుంది. మార్కెట్లో టొయోటా హైరైడర్ ధరలు రూ. 15.11 లక్షల నుండి రూ.18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎస్‌యూవీని రూ. 25,000 టోకెన్ అడ్వాన్సుతో బుక్ చేసుకోవచ్చు. ఈ పండుగ సీజన్లో దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
గ్రాండ్ విటారా మాదిరిగానే టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా మైల్డ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్లతో రానుంది. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీలో ప్రధానంగా వైర్లెస్ ఛార్జింగ్, పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.
5. సిట్రోయెన్ సి3
చిన్న కారు విభాగంలో పోటీని పెంచేందుకు ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ ఈ ఏడాది ఓ కొత్త కారును విడుదల చేసింది. గడచిన జులై నెలాఖరులో కంపెనీ తమ సరికొత్త సి3 (C3) హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) రెండు రకాల పెట్రోల్ ఇంజన్ (1.2 లీటర్ న్యాచురల్ మరియు 1.2 లీటర్ టర్బో) ఆప్షన్లతో లభిస్తోంది. ఈ రెండు ఇంజన్లు కూడా కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరోలనే ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ కూడా రానుంది.
దేశీయ విపణిలో సిట్రోయెన్ సి3 ఎస్యూవీ ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ. 8.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది లివ్ మరియు ఫీల్ అనే రెండు ట్రిమ్ లలో మొత్తం ఆరు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఈ కారులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 10 ఇంచ్ సిట్రోయెన్ కనెక్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వన్-టచ్ డౌన్ విండోస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.