Latest Posts

అమరావతిపై కోపం లేదు-అందులో 10శాతం పెడితే విశాఖ రాజధాని-అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ చేపట్టింది. ఇందులో అమరావతి స్ధానంలో మూడు రాజధానులు ఎందుకు అవసరమో మంత్రులు తమ అభిప్రాయాలు చెప్పారు. అనంతరం చర్చకు ముగింపు నిస్తూ సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. అమరావతిలో రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబే కాదు ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని జగన్ తేల్చిచెప్పేశారు. అందుకే తాను విశాఖను రాజధానిగా ఎంచుకున్నట్లు జగన్ తెలిపారు.

1956 నుంచి 2014 వరకూ 58 సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రం విడిపోతున్నప్పుడు కానీ, హైదరాబాద్ వదిలి వచ్చేస్తున్నప్పుడు కానీ ఒక్కరోజు కానీ ఎలాంటి ఉద్యమాలు చేయని చంద్రబాబు, ఎలాంటి బాధాపడని రామోజీరావు, రాధాకృష్ణ, ఆయన బృందం… ఇవాళ రాజధాని ఉద్యమాలు చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి ఈ ప్రాంతానికి తాత్కాలికమనే 58 నెలల కాలం కూడా రాజధానిగా పాలించని ప్రాంతం గురించి బాబు ఎలాంటి అభివృద్ది చేయని, చేయలేని ప్రాంతం గురించి ఈ రోజు ఉద్యమాలట, రకరకాల డ్రామాలు వేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి వీల్లేదని ఉద్యమం కానీ, యాత్ర కానీ చేయని ఈ పెత్తందారులంతా, ఈ మహానుభావులంతా ఇవాళ వారు కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ వెయ్యిరోజుల కృత్రిమ రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తూ,ఇతర ప్రాంతాల్ని రెచ్చగొడుతూ ఓ డ్రామా నడుపుతున్నారని జగన్ విమర్శించారు.

దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటేకూడా ఈ కట్టని, కట్టలేని అమరావతి వీరి దృష్టిలో ఎంతో గొప్పదంటూ జగన్ ఆక్షేపించారు. ఎందుకు వీరి దృష్టిలో అమరావతి గొప్పదో ఆలోచించాలన్నారు. ఎవరి అభివృద్ధి కోసం వీరంతా ఉద్యమాలుచేస్తున్నారో ఆలోచించాలన్నారు. బీసీల అభివృద్ధి కోసమా, ఎస్సీల అభివృద్దికోసమా, ఎస్టీల అభివృద్ధి కోసమా మైనార్టీల అభివృద్ధి కోసమా, పేద ఓసీల అభివృద్ధి కోసమా అదీ కాదా, మూడు ప్రాంతాల అభివృద్ది కోసమా , కాదే లేదే ఈ పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని జగన్ అన్నారు.

2019లో రాష్ట్ర బడ్జెట్ అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ భరోసా, రైతు భరోసా ఎందుకు లేదని ప్రశ్నించారు. నవరత్నాల పథకాల ద్వారా అక్షరాలా లక్షా 65 వేల కోట్లు బటన్ నొక్కి డీబీటీ ద్వారా ఇస్తున్నామని, చంద్రబాబు హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్ ఉంటే ఈ పథకాలు ఎందుకు అమలు కాలేదు. డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని జగన్ ప్రశ్నించారు. అప్పుడు డీపీటీ పథకం. దోచుకో పంచుకో తినుకో … చంద్రబాబు, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడు..అప్పట్లో ప్రశ్నించే వారు లేరు. మేం ప్రశ్నించినా గొంతు నొక్కేస్తారన్నారు. రాజధాని అంటే మా బినామీ భూముల ప్రాంతమే ఉండాలనేది వారి ఆలోచన అని జగన్ అన్నారు.

అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదని జగన్ తెలిపారు. ప్రతీ ప్రాంతం బాగుపడాలి, ఆ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలనేదే తన తాపత్రయమన్నారు. ఆ ప్రాంతంపైనా, అక్కడి ప్రజలపైనా వ్యతిరేకత ఉండదన్నారు. అమరావతి విజయవాడకూ, గుంటూరుకూ దగ్గర లేదన్నారు. ఏ నగరానికీ దగ్గరలేని ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, నీరు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ లేవన్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి 2 లక్షల చొప్పున లక్షా 10 వేల కోట్లు అవుతుందని చంద్రబాబే లెక్కవేశారని, 8 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం లక్ష కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉందన్నారు. ఐదేళ్లపాలనలో చంద్రబాబు దీనిపై ఎంత ఖర్చుపెట్టారో సభ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు. ఐదేళ్లలో గ్రాఫిక్స్ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై 420కేసు పెట్టాలన్నారు. రాజధానిపై ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి ఐదేళ్లలో 5674 కోట్లు ఖర్చుచేసి 2297 కోట్లు మాకు బకాయి పెట్టి వెళ్లిపోయారని జగన్ ఆరోపించారు.
ఏ ప్రభుత్వం కూడా ఏడాదికిఇంతకన్నా ఎక్కువగా పెట్టలేని పరిస్ధితి ఉందన్నారు. ఏడాదికి వెయ్యి, 2 వేల కోట్లు పెట్టలేని పరిస్ధితుల్లో మన రాష్ట్రం ఉందన్నది అందరూ తెలుసుకోవాలన్నారు. 80 శాతం పైచిలుకు మంది ప్రజలు తెల్ల రేషన్ కార్డుపై బతుకుతున్నారన్నారు. అమరావతికి లక్షకోట్లు పెట్టాలంటే ఈ లెక్కన వందేళ్లు పడుతుందన్నారు. అమరావతిలో రాజధాని తీసేయడంలేదు. విశాఖ,కర్నూలుతోపాటు ఇక్కడా రాజధాని కొనసాగిస్తున్నామన్నారు.

రాష్ట్రమంటే 8 కిలోమీటర్ల పరిధి కలిగిన ప్రాంతం కాదని జగన్ తెలిపారు. రాష్ట్రమంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగమన్నారు. కేవలం 50వేల ఎకరాల లబ్ది కోసం మాత్రమే ఉన్న భూమి కాదన్నారు. చంద్రబాబు దృష్టిలో రైతులంటే 35 వేల ఎకరాలిచ్చిన వారంటే కుదరదు, మా దృష్టిలో వీరితో పాటు రైతు భరోసా అందుకుంటున్న 50 లక్షల మంది రైతులు కూడా అని జగన్ అన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానేనా అనేది అంతా ఆలోచించాలని జగన్ తెలిపారు. గ్రీన్ ట్రైబ్యునళ్లు, నదీ పరిరక్షణ పరిధిలో ఉన్న ప్రాంతాలు, కృష్ణానదీ పరివాహక ప్రాంతాలన్నీ 8820 ఎకరాల భూములు ఇక్కడ ఉన్నాయని, ఇవి తీసేస్తే మరో 4997 ఎకరాలు మాత్రమే ఉందన్నారు.

లంకభూములు, ఎన్జీటీ భూములు, కరకట్ట అన్నీ కలుపుకున్నా 820 ఎకరాలే ఉందన్నారు. చంద్రబాబు గతంలో చెప్పిన ప్రకారమే 5020 ఎకరాలు మాత్రమే వాణిజ్య అవసరాల కోసమే ఉందన్నారు. వీటిని ఎకరాకు 20 కోట్ల చొప్పున ఇప్పుడు అమ్మితే లక్ష కోట్లు వస్తుందన్నారు. అప్పుడు మాత్రమే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం
ప్రస్తుతం అమరావతిలోని భూములకు అంత ధర రాకపోతే ఎలా అభివృద్ధి అవుతుందని ప్రశ్నించారు.

అమరావతి నిర్మించే వ్యయంలో కేవలం 10 శాతం పెడితే విశాఖ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని జగన్ తెలిపారు. తనకు అమరావతి ప్రజలైనా, విశాఖ ప్రజలైనా సమానమేనన్నారు. ప్రస్తుతం విశాఖ రాష్ట్రంలో అతిపెద్ద నగరం సహజంగానే అభివృద్ధి జరిగిన ప్రాంతమని జగన్ తెలిపారు. కొంచెం ఆర్ధికంగా ఊతమిస్తే విశాఖ కచ్చితంగా మంచినగరం అవుతుందన్నారు. విశాఖను అభివృద్ధి చేసే పనిచేస్తుంటే దాన్నీ అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రబాబుతో పాటు ఎవరూ చేయలేని ఈ ప్రాజెక్టు గురించి రోజూ డ్రామాలు చేస్తున్నారన్నారు.
కనీసం విజయవాడ నగరానికైనా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక విజయవాడ పశ్చిమ ప్రాంతంలో బైపాస్ నిర్మాణం చేస్తున్నామన్నారు. చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ 17.8 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తి అయ్యిందని, వచ్చే ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం చినకాకాని నుంచి గొల్లపూడి వరకూ నదిపై వంతెన రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1600 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నామన్నారు. అలాగే విజయవాడ తూర్పు భాగంలోనూ 40 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో స్వయంగా సంప్రదింపులు జరిపి ఆరు నెలల్లోనే ప్రాజెక్టు ప్రారంభించేలా చేస్తామన్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులూ వైసీపీ ప్రభుత్వం వచ్చాకే పూర్తి అయ్యాయన్నారు. విజయవాడ కృష్ణ లంక ప్రాంతంలోనూ నదీ వరద రాకుండా రక్షణగోడ నిర్మించామన్నారు. విజయవాడ ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనన్న దుర్బుద్ధి చంద్రబాబుది అని జగన్ తెలిపారు. కనకదుర్గ గుడి అభివృద్ధికి 70 కోట్లు వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదే కనకదుర్గ గుడి చుట్టూ దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదన్నారు. విజయవాడలో స్వరాజ్ మైదాన్ వద్ద అంబేద్కర్ పార్కు నిర్మిస్తున్నామన్నారు.

మూడేళ్ల క్రితం గ్రామ సచివాలయాలు, ఆ వ్యవస్థ గురించి ఎవరూ ఊహించలేదని, పౌరసేవలు అందించటంలో ఆ వ్యవస్థ అందిస్తున్న తీరు అందరికీ ఆదర్శప్రాయంగా ఉందని జగన్ తెలిపారు. 15004 గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతీ సచివాలయం 600 పౌర సేవలు అందిస్తోందన్నారు. 1.20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. పాలన వికేంద్రీకరణ అంటే ఇదేనన్నారు. చంద్రబాబు ఊహకు కూడా అందని అంశం ఇది అన్నారు. రాజధాని భూముల రేట్ల కోసమే రైతుల ఉద్యమం చేస్తున్నారని, వికేంద్రీకరణకు అసలైన అర్ధం చెబుతూ రాష్ట్రంలో 26 జిల్లాలు చేశామన్నారు. 103 పోలీసు డివిజన్లు , 75 రెవెన్యూ డివిజన్లు చేసి వికేంద్రీకరణ చేశామన్నారు. చంద్రబాబు కూడా కుప్పం రెవెన్యూ డివిజన్ చేయాలని తనకు లేఖ రాశారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారో తెలియటం లేదని జగన్ అన్నారు. పాలన వికేంద్రీకరణ వల్లే వరదల్లో ప్రజలకు పప్పులు, ఉప్పులు, బంగాళదుంపలు వేగంగా అందించామన్నారు.

అమరావతి నుంచి రైతులు అరసవెల్లి వెళ్లి దేవుడికి మొక్కడం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి వద్దు అదంతా అమరావతిలో ఉండాలని మొక్కుతారట అన్నారు. అక్కడి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ఇలా చంద్రబాబు చేస్తున్నారన్నారు. మా ప్రాంతం అభివృద్ధి కావాలని ఉత్తరాంధ్ర దేవుడ్ని కోరుకోవడం ఏమిటన్నారు.
ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయాల కోసమే ప్రజలు- ప్రజలు కొట్టుకోవాలని , అగ్గిరాజేస్తున్నారని జగన్ తెలిపారు. అన్ని ప్రాంతాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే వికేంద్రీకరణ విధానం తీసుకువస్తున్నామన్నారు. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర రాజధానుల వరకూ వైసీపీ ప్రభుత్వానిది ఇదే విధానం అన్నారు. తాను ఈ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకిని కానని, కాబట్టే మూడు రాజధానుల్లో ఒకటి ఇక్కడే ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రజల ఆమోదంతోనే కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల్లోని 33 సీట్లలో 29 సీట్లను వైసీపీ గెలుచుకుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయన్నారు. అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి కేవలం 2 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయన్నారు. వికేంద్రీకరణ అనేది ఓ మంత్రంగా మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Latest Posts

Don't Miss