తెల్లని ఎడారిలోని ప్రకృతి మలచిన అద్భుత దృశ్యమాలిక గుజరాత్‌లోని కచ్. గొప్ప సాంస్కృతిక, కళాత్మక వారసత్వానికి ప్రతీక ఈ ప్రాంతం. మూడు నెలలకుపైగా జరిగే రణ్ ఉత్సవ్ సాంస్కృతిక ప్రదర్శన ఇక్కడి సహజ సౌందర్యంతోపాటు వివిధ రకాల కళలను ఏకం చేస్తుంది. ఆహ్లాదాన్ని పంచే సాహస క్రీడలను ఆస్వాదించేందుకు దేశ విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి ఎడారి సరస్సు వర్షరుతువులో సముద్ర జలాలతో కనువిందు చేస్తుంది. ఈ సరస్సు విస్తీర్ణం ఏడున్నరవేల కిలోమీటర్లకు పైగా ఉంటుంది. శరత్కాల వెన్నెలలో ఉప్పూరి, మంచు ఎడారిలా కనువిందు చేసే ఆ అద్భుతాన్నే వైట్రణ్గా పిలుస్తారు.
గుజరాత్‌లోని కచ్‌ను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ రణ్ ఉత్సవ్‌కు శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. టెంట్ విలేజ్ నుంచి ఉప్పుటెడారి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు సందర్శకులు రకరకాలైన ప్రయాణ సాధనాల ద్వారా వైట్ రణ్కు చేరుకుంటారు. కొందరు పరుగులుతీసే ఒంటెలపై విహరిస్తూ అక్కడికి చేరుకుంటారు. అందుకు అవసరమైన ఒంటెలు అద్దెలకు లభిస్తాయి. తెల్లని ఇసుక తెన్నెలపై వయ్యారాలుపోతూ సాగే ఆ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. అలాగే, కొంతమంది పర్యాటకులు బృందాలుగా ఏర్పడి, ఒంటెల బండిపై ఊరేగింపుగా కూడా వెళుతుంటారు. ఇంకొందరు టెంట్ విలేజ్ నుంచి మోటార్‌బైక్‌లపై చిత్రవిచిత్రమైన అలంకరణతో కేరింతలు కొడుతూ చేరుకుంటారు.
కళ్లు చెదిరే నైపుణ్యాలు..
ఈ ఉత్సవ్లోని ప్రయాణంలో ఓపెన్ టాప్ బస్సులో సాగే రణ్ సఫారీ మరచిపోలేని అనుభూతినిస్తుంది. కుటుంబసమేతంగా సాగే ఈ ప్రయాణంలో కచ్ సహజసిద్ధ అందాలు మనసును హత్తుకునేలా చేస్తాయి. నిజానికి ఈ ఉత్సవాలు సుధీర్ఘ సమయం కొనసాగుతాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన మధురక్షణాలను కెమెరాల్లో బంధిస్తుంటారు యాత్రికులు. కుట్లు, అల్లికల్లో కళ్లు చెదిరే నైపుణ్యం ఇక్కడి మహిళల సొంతం. సృజనాత్మకతలో మగవాళ్లూ అంతే. కలపతో కళాత్మక వస్తువులను అలవోకగా చేస్తారు.
సాహస క్రీడల వేదికలు..
వైట్ రణ్ను ఆనుకొని సాహస క్రీడల వేదికలు ఉంటాయి. రాక్ క్లైంబింగ్, ర్యాపెలింగ్ వాల్, పెండలమ్ స్వింగ్, పారా సైలింగ్, బైకింగ్ వంటి క్రీడలు యువతకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. టెంట్ విలేజ్, ఉప్పుటెడారి మాత్రమే కాదు కచ్ సౌందర్యాన్ని కళ్లముందుంచే పర్యాటక కేంద్రాలెన్నో ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. టెంట్ విలేజ్‌కు 140 కిలోమీటర్ల దూరంలోని మాండ్వి పట్టణంలో అరబిక్ కడలా అందాలు కట్టిపడేస్తాయి. ఇక్కడ చిన్న చిన్న నాటు పడవల నుంచి భారీ నౌకల వరకు తయారు చేస్తుంటారు. మాండ్వీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే విజయ విలాస్ ప్యాలెస్ చూడాల్సిన ప్రదేశం. ధోర్డోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామం లుదియా. హస్తకళలకు ఈ గ్రామం పెట్టింది పేరు. పాలరాతి గోపురాలతో సుందరంగా కనిపించే స్వామినారాయణ ఆలయం భుజ్ పట్టణంలో ఉంటుంది. టెంట్ విలేజ్‌కు ఈ ఆలయం 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రణ్ ఉత్సవ్‌కు ముస్తాబవుతోన్న కచ్!
కచ్‌ను సందర్శించడానికి చలికాలం ఉత్తమమైన సమయం. ఈ సీజన్లో ఇక్కడ ఉష్ణోగ్రత 25 నుంచి 12 డిగ్రీల వరకూ ఉంటుంది. ఈ వాతావరణం పర్యటనకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి విమాన, రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. తక్కువ ధరలలో విడిది కేంద్రాలు కూడా కచ్‌లో అందుబాటులో ఉంటాయి.