రాబోయే రోజుల్లో మీరు కూడా ఏదైనా గొప్ప ప్రదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే, ఘన్సాలీకి తప్పకుండా చేరుకోండి. ఘన్సాలీ సందర్శనలో ప్రసిద్ధ ప్రదేశాలు మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి. చల్లని గాలి, చుట్టూ పచ్చదనం మధ్య ప్రయాణం ఒక విభిన్నమైన వినోదమనే చెప్పాలి.
ముఖ్యంగా మైదాన ప్రాంతంలోని కొన్ని జనసంచారం లేని ప్రదేశాలను సందర్శించేందుకు ఘన్సాలీ ప్రయాణం సరైన ఎంపిక. ఢిల్లీ నుండి 311 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘన్సాలీ ప్రకృతి సంపదల మధ్య ఉన్న అద్భుతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఘన్సాలీలోని ఉత్తమ ప్రదేశాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది.
గార్కోట్ గ్రామం
ఘన్సాలీలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం ఏదైనా ఉంటే, దాని పేరు గార్కోట్ గ్రామం. ప్రధాన నగరం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం చుట్టూ అన్ని వైపులా పర్వతాలు కమ్మేసినట్లు దర్శనమిస్తాయి. ఈ పర్వత శ్రేణుల సముదాయం అక్కడి ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తుంది. అందుకు గార్కోట్ ప్రాంతం కుటుంబసమేతంగా సందర్శనీయ ప్రదేశంగా పేరుగాంచింది. ఏ సీజన్లో అయినా గార్కోట్ పర్యటనకు అనువుగానే ఉంటుంది. ఇక్కడ విడిది చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఎత్తయిన పర్వతాలు మరియు పైన్ చెట్లు ఈ ప్రదేశానికి సందర్శనకు ఆహ్వానమిస్తాయి.
భిలంగనా నది
ఈ అందమైన గార్కోట్ గ్రామం భిలంగనా నది ఒడ్డున నెలకొని ఉంది. ఈ నది భగీరథి నదికి ప్రధాన ఉపనదిగా ప్రసిద్ధిగాంచింది. పెద్ద పెద్ద బండ రాళ్లను దాటుకుంటూ ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటి అలలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. నదిలోని నీరు అడవుల మధ్య నుండి క్రిందికి వచ్చినప్పుడు, ఈ నది మార్గంలో అనేక అద్భుతమైన దృశ్యాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. అంతేకాదు, ఘన్సాలీలోని హనుమాన్ దేవాలయం పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది. పర్వతాల మధ్యలో ఉన్నందున, పర్యాటకులు ఇక్కడకు విహరించడానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఈ ఆలయం పర్యాటకులకు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా పవిత్ర స్థలం. ఈ ఆలయం చుట్టూ పచ్చదనం మరియు ఎత్తయిన పర్వతాలు చూస్తే, ఖచ్చితంగా తృప్తి చెందాల్సిందే. ట్రెక్కింగ్ చేసేందుకు ఇక్కడి పర్వత శ్రేణులు ఎంతో అనువుగా ఉంటాయి.
గ్వీల్
ఘన్సాలీకి కొద్ది దూరంలో ఉంది గీల్. అన్ని వైపులా పర్వతాలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న పట్టణమిది. పర్యాటకులు సెల్ఫీలు తీసుకునేందుకు అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ టిబెటన్ ప్రజలు కూడా కనిపిస్తారు. వారి సంస్కృతిని దగ్గరగా చూసేందుకు గ్వీల్ ఎంతగానో ఉపకరిస్తుంది. వారి ఆహారపు అలవాట్లు అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. అక్కడి రుచులను మనం మనసారా ఆస్వాదించవచ్చు. ఘన్సాలీ టెహ్రీ నుండి 59 కిలోమీటర్లు, గౌరీకుండ్ నుండి 129 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది డెహ్రాడూన్ నుండి 165 కిలోమీటర్ల, రిషికేశ్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు డెహ్రాడూన్ లేదా రిషికేశ్ నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. ఘన్సాలీ జాలీ గ్రాంట్ విమానాశ్రయం (డెహ్రాడూన్) నుండి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది.