ఇక నైట్ సఫారీతో జంతు ప్రేమికులకు పండగే..
లక్నో జంతుప్రదర్శనశాలలో నైట్ సఫారీ ఆస్వాదించండి. అవును, ఇప్పుడు మీరు రాత్రిపూట విహరిస్తూ.. జంతువులను దగ్గరగా చూడవచ్చు! శతాబ్ద కాలం నాటి నవాబ్ వాజిద్ అలీ షా జూలో ఆ అవకాశం ఉండబోతోంది. దీనినే లక్నో జూ అని కూడా పిలుస్తారు. దీనిని కుక్రైల్ ఫారెస్ట్‌కు మార్చాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. అడవిలో నైట్ సఫారీలను ప్రోత్సహించే ప్రణాళికకు ఆమోదం లభించడం ప్రకృతి ప్రేమికులకు మంచి బహుమతి అనే చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం ఆ విశేషాలు చూద్దాం రండి!
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పర్యాటకంపై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో సహజ వనరులను మరియు వన్యప్రాణులను రక్షించడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్ఖైల్లో జూలాజికల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. లక్నో జంతుప్రదర్శనశాలను కుక్రైల్కు మార్చనున్నారు.
జూ రద్దీగా ఉండే నార్హి ప్రాంతంలో ఉన్నందున, రద్దీని తగ్గించడానికి ఈ చర్య తీసుకోబడింది. మీడియా నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్ టూరిజం మంత్రి జయవీర్ సింగ్ ఈ చర్యను ప్రతిష్టాత్మకమైన ప్రణాళికగా పేర్కొన్నారు. సర్వే చేసి అంచనాల సమాచారం తెలుసుకోవడం కోసం ఒక కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. కుక్రైల్ మరియు లక్నో జంతుప్రదర్శనశాలలో నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి ప్రస్తుత వృక్షజాలం మరియు జంతుజాలానికి హాని కలిగించకుండా ప్రణాళికలు వేస్తున్నారు. ప్రస్తుతం ఉపయోగంలో లేని బహిరంగ ప్రదేశాలను మాత్రమే వీలైనంత వరకు వినియోగిస్తామని మంత్రి ప్రకటించారు.
ఎకో టూరిజం
రాష్ట్రంలో ఎకో-టూరిజంను ప్రోత్సహించడం, స్థానికులకు ఉపాధి కల్పించడం, సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని విస్తరించడం ఈ చర్య లక్ష్యం. దానికి అనుగుణంగా పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదనంగా, పర్యాటకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కుక్రైల్ అటవీ సమీపంలో నాలుగు లేన్ల రోడ్లు నిర్మించనున్నారు. కుక్రైల్ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
సంబంధిత పర్యావరణ మరియు అటవీ అధికారులతో తగు సంప్రదింపుల తర్వాత, ఒక నివేదికను క్యాబినెట్‌కు పంపుతామని మరియు దాని ఆధారంగా ప్రాజెక్ట్ ఖర్చును నిర్ణయిస్తామని చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 56 ఎకో-టూరిజం ప్రదేశాలను గుర్తించింది. ఈ ప్రాంతాలను పూర్తి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసి, పర్యాటక రంగాన్ని విసృతం చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు.
జూలో నైట్ సఫారీ
ప్రస్తుతం 2,027 హెక్టార్లలో ఉన్న దట్టమైన అడవికి ఎలాంటి ఆటంకం కలగకుండా నైట్ సఫారీ కోసం 350 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సృష్టించనున్నట్లు సమాచారం. కాంక్రీట్ నిర్మాణాలను తగ్గించేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. నైట్ సఫారీ ద్వారా జూ యొక్క మార్గాలను అన్వేషించడం మర్చిపోలేని అనుభవాలను చేరువ చేస్తుంది.
అంతేకాదు, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు అడవుల గురించి మరింత అవగాహన కల్పించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటిగా వారు భావిస్తున్నారు. సందర్శకులకు ఆహ్లాదం చేరువచేయడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడంపై సామాన్యుల్లో సైతం అవగాహన పెంచేందుకు ఈ చర్యలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ నైట్ సఫారీ ద్వారా జంతు ప్రేమికులు కొత్త ప్రదేశంలో ప్రపంచ స్థాయి నైట్ సఫారీని కూడా ఆనందించవచ్చు.