Latest Posts

ఆహ్లాదాన్ని పంచే అసాధార‌ణ హిల్ స్టేష‌న్ విశేషాలు 

ప‌నిఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం సాధారణంగా కొంతమంది విహారయాత్ర రద్దీగా లేని అద్భుతమైన ప్రదేశాల‌ను సందర్శించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మ‌రి కొంతమందికి, విశ్రాంతి కోసం ఏకంత‌మైన ప్ర‌దేశాల‌ను ఎంపిక చేసుకుంటారు. అయితే ప్రశాంతతతోపాటు అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాల‌నుకునేవారు ఎత్త‌యిన ప‌ర్వ‌త శ్రేణుల‌ను ఆశ్ర‌యిస్తారు.

ప్రశాంతమైన పచ్చదనంతో కప్పబడిన ఈ కొండలు మ‌రో ప్ర‌పంచ‌పు అనుభూతుల‌ను చేరువ చేస్తాయి. భారతదేశంలోని ఈ అసాధారణ హిల్ స్టేషన్‌లను జీవితంలో ఒక్క‌సారైనా చేరుకోవాల్సిందే. అందుకే అలాంటి వాటిని మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం. మ‌రెందుకు ఆల‌స్యం, అలాంటి హిల్ స్టేష‌న్‌ల విశేషాలు తెలుసుకుందాం ప‌దండి.

     కోక‌ర్నాగ్

కోక‌ర్నాగ్

జ‌మ్మూ మ‌రియూ కాశ్మీర్‌లోని అనంత‌నాగ్ జిల్లాలో ఉంది. ఈ పచ్చని లోయకి చేరుకోగానే స్వచ్ఛమైన గాలిలో పుష్పించే పూల సువాసన స్వాగతం పలుకుతుంది. ఈ ప్రాంతం ప్ర‌సిద్ధ వారాంత‌పు విహార కేంద్రంగా ప్ర‌సిద్ధి పొందింది. స‌హ‌జ నీటి స‌ర‌స్సులు, రంగురంగుల మొక్క‌లు, ప‌చ్చ‌ని ప‌చ్చిక బ‌య‌ళ్లతో విరాజిల్లుతున్న కొక‌ర్నాగ్ బొటానిక‌ల్ గార్డెన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఇక్క‌డే ఆసియాలోనే అదిపెద్ద ట్రౌట్ ఫిష‌రిని సంద‌ర్శించే అవ‌కాశం దొరుకుతుంది. కాలుష్య ర‌హిత‌మైన కోక‌ర్నాగ్ వాతావ‌ర‌ణం అన్ని స‌మ‌యాల్లోనూ సంద‌ర్శ‌కుల‌కు ఆహ్వానిస్తోంది. కుటుంబ స‌మేతంగా ప్ర‌కృతి అందాలను ఆస్వాదించాల‌ని కోరుకునేవారికి కోక‌ర్నాగ్ స‌రైన ఎంపిక అనే చెప్పాలి. మెచుకా

మెచుకా

అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా, సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక లోయ ప్రాంతం. ఇటీవలే దీనిని సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశంగా గుర్తించారు. దీనిని అరుణాచల్ ప్రదేశ్ నిషేధిత లోయ అని కూడా పిలుస్తారు. వైవిధ్య‌భ‌రిత‌ ప్రకృతి వైభవాలతో ప్ర‌కృతి ప్రేమికుల‌ స్వర్గధామంగా మెచుకా పిల‌వ‌బడుతుంది. ఈ సీజ‌న్‌లో ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు రెట్టింపుగా ద‌ర్శ‌న‌మిస్తాయి. సియోమ్ నది, అసాధారణ సంస్కృతులు, అద్భుతమైన సహజ సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, మనోహరమైన దృశ్యాలు దీని ప్ర‌కృతి అందాల‌ను రెట్టింపు చేస్తున్నాయ‌నే చెప్పాలి. లంబసింగి కొండలు

లంబసింగి కొండలు

ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్‌గా అని పిలువబడే లంబసింగి దక్షిణ భారతదేశంలో శీతాకాలపు మంచు కురిసే ఏకైక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది టీ మరియు కాఫీ తోటలతో ఆక‌ర్ష‌ణీయంగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అంతేకాదు, చిన్న సైజ్‌ ఆపిల్ మరియు స్ట్రాబెర్రీ పొలాలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. ఇక్క‌డికి చేరుకునేందుకు వంపులు తిరిగే మార్గంలో చేసే ప్ర‌యాణం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. గిరిజ‌న సంస్కృతిని ద‌గ్గ‌ర‌గా చూసేందుకు లంబ‌సింగి ప్ర‌యాణం అస‌లైన గ‌మ్య‌స్థానంగా చెప్పుకోవ‌చ్చు. చక్రతా

చక్రతా

ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించాలి అనుకునేవారు ఉత్తరాఖండ్‌లోని చక్రతాకు ప్రయాణించవచ్చు. ఇది ఎత్త‌యిన శిఖ‌రాగ్రాన కొలువై ఉంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 7000-7250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌సిద్ధ టైగ‌ర్ ఫాల్స్ త‌ప్ప‌నిస‌రిగా సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశం. ఇది మూడు వంద‌ల అడుగుల ఎత్తునుంచి జాలువారే నీటి అందాలు ప‌ర్యాట‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేస్తాయి. స్థానిక రుచుల‌ను మ‌న‌సారా ఆస్వాదించ‌వ‌చ్చు. అంతేకాదు, ఎటు చూసినా ప‌చ్చ‌దనం క‌మ్మేసిన విశాలమైన‌ కొండ‌లు, లోయ‌ల దృశ్యాలతో చ‌క్ర‌తా నిత్యం ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఆక‌ర్షిస్తుంది. అందుకే, ఏటా ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కులు సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది.

Latest Posts

Don't Miss