బాంబు లాంటి వార్త..
ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం అందులోనూ ప్రధానంగా US ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ముందు పెద్ద కంపెనీలు కార్మికులను తొలగిస్తున్నాయి. ఈ వార్తలు రోజూ వింటున్నవే. అయితే తాజాగా ఈరోజు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాంబు లాంటి వార్తను ప్రకటించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపు గురించి ఎలాంటి ప్రకటన చేయని గూగుల్.. రానున్న క్వార్టర్లో ఫలితాలు అంచనాలను చేరుకోకపోతే పరిస్థితులు వేరేవిధంగా ఉంటాని ఉద్యోగులను హెచ్చరించింది.
సీఈవో ఏమన్నారంటే..
ఇటీవల జరిగిన ఒక సదస్సులో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. కంపెనీ ఇప్పుడు ఉన్నదానికంటే 20 శాతం మరింత సమర్థవంతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిని సాధించేందుకు ఉద్యోగులందరూ పూర్తిగా నిమగ్నమై ఉండేలా చూడాలని అన్నారు. ఇందులో భాగంగా అవసరమైనంత మేరకు ఉద్యోగుల తొలగింపు ఉంటుందని హింట్ ఇచ్చారు. కంపెనీ కెపాసిటీని 20 శాతం మేర పెంచలేనిపక్షంలో అనవసర అనవసరపు వర్క్ ఫోర్స్ ను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
తగ్గిన ఆదాయాలు..
ఆర్థిక మాంద్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రకటనల కోసం పెద్దగా ఖర్చు చేయకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకంటే.. Google తన ఆదాయంలో ఎక్కువ భాగం ప్రకటనల రాబడిపై ఆధారపడుతుంటుంది. ఇలాంటి సమయంలో గూగుల్ ఎలా ముందుకు సాగగలదని సుందర్ పిచాయ్ ప్రశ్నించారు. ఉద్యోగుల సంఖ్య తగ్గించినప్పుడు.. మిగిలిన వారు ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తూ వేగంగా పనిచేయవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
వేగం పెంచేందుకు..
చాలా మంది ఉద్యోగులు ఉంటే.. ఒక విషయంపై నిర్ణయం ఆలస్యం అవుతుంది. ఇది ఉద్యోగుల ఉత్పాదకతను, కంపెనీ వృద్ధి రేటును తగ్గిస్తుంది. అవసరమైన చోట తగినంత మంది సిబ్బందిని ఉంచడం ద్వారా ఈ ఆలశ్యాన్ని సరిచేయవచ్చని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. దీంతో మరికొద్ది వారాల్లో గూగుల్ నుంచి ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా.. మైక్రోసాఫ్ట్, ఉబర్, యాపిల్, టెస్లా, మెటాతో పాటు ఉద్యోగుల తొలగింపు జాబితాలో గూగుల్ చేరే అవకాశం తాజా ప్రకటనతో స్పష్టంగా కనిపిస్తోంది.