షాకింగ్ నివేదిక..
ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను నిశితంగా విశ్లేషిస్తే ఐటీ బబుల్ పగిలిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే స్టాఫింగ్ సంస్థ Xpheno ఇచ్చిన తాజా నివేదిక అవుననే అంటోంది. దీనికి ద్రవ్యోల్బణంతో పాటు కంపెనీల అంతర్గత సమస్యలు సైతం కారణంగా నిలుస్తున్నాయి.
తగ్గిన ఉద్యోగ అవకాశాలు..
గత సంవత్సరంతో పోలిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు 23% తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ గమనించాల్సింది ఉద్యోగుల కొరత కాదు.. ఉద్యోగాల కోత అని టెక్కీలు గమనించాలి. అంటే పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గాయని పరిగణలోకి తీసుకోవాలి. IT రంగంలో చురుకైన ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 2021తో పోలిస్తే 2022 ఆగస్టులో 23 శాతం తగ్గాయని స్టాఫింగ్ సంస్థ Xpheno బయట పెట్టడం కొంత ఆందోళనను కలిగిస్తోంది.
వేరియబుల్ వేతనాలు..
ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని విడుదల చేయడంలో కూడా ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఆలస్యం చేస్తున్నారు. TCS, Infosys, Wiproలోని ఉద్యోగులు వేరియబుల్ వేతనాన్ని వాయిదా వేయడాన్ని లేదా పాక్షికంగా తగ్గించడాన్ని ఎదుర్కొంటున్నారు. విప్రో ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ చెల్లింపులను నిలిపివేసింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సగటున 70 శాతం వరకు మాత్రమే వేరియబుల్ శాలరీని చెల్లిస్తోంది. టీసీఎస్ హైక్స్ విషయంలో కొత్త ఉద్యోగులకు షాకింగ్ కబురు చెప్పింది.
తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య..
జూలై 2022తో పోలిస్తే నెలవారీ ప్రాతిపదికన ఐటీ పరిశ్రమ వరుసగా 5 శాతం, జాబ్ ఓపెనింగ్ వాల్యూమ్లలో 7 శాతం తగ్గుదలను నమోదు చేసింది. జూలై 2022లో 1,72,000 ఉద్యోగాలు ఉండగా.. ఆగస్టు 2022లో వారి సంఖ్య 1,65,000కి చేరుకుంది. నెలవారీ ప్రాతిపదికన ఇది జూన్ 2022 కంటే 4 శాతం తగ్గుదలగా చెప్పుకోవాలి.
రాబోయే మాంద్యంతో.. భారీ డ్రాప్
అత్యధిక ఉద్యోగ అవకాశాలను అందించిన ఐటీ రంగం, గత ఏడాదిలో కొనసాగించిన 80 శాతం ప్లస్ రేంజ్‌తో పోలిస్తే మొత్తంగా 63 శాతానికి పడిపోయింది. ఇది గడచిన 30 నెలల్లో టెక్ రంగం నమోదు చేసిన కనిష్ఠ శాతం. 2021 రికార్డు నియామకాల తర్వాత.. ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో రాబోతున్న మాంద్యం, ద్రవ్యోల్బణం, మార్జిన్ ఒత్తిళ్లకు అనుగుణంగా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యపై కోతవిధిస్తున్నాయి.
కరోనా కాలంలో ఓవర్‌హైరింగ్..
భారతదేశంలో కరోనా సమయంలో రిక్రూట్మెంట్ చరిత్రలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో కంపెనీలు ఉద్యోగులను భారీగా నియమించుకున్నాయి. కాకపోతే టాలెంటెడ్ ఉద్యోగుల నిష్క్రమణను ఎదుర్కొనేందుకు కంపెనీలు ఇలా చేసినట్లు Xpheno సహ వ్యవస్థాపకుడు అనిల్ ఈతానూర్ తెలిపారు.
సీరియస్ గా యాజమాన్యాలు..
నియామకంలో మందగమనం మార్కెట్లో అసాధారణంగా అధిక అట్రిషన్ రేట్లు, అసమంజసమైన వేతన యుద్ధాలను అధిగమించడంలో యజమానులకు ఈ సమయం సహాయపడుతుంది. త్వరలోనే మూన్ లైటింగ్ వంటి పరిస్థితులను కంపెనీ యాజమాన్యాలు అదుపులోకి తీసుకొస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు తక్కువగా ఉన్నందున.. మార్కెట్లోని ఆటుపోట్లు మరోసారి యజమానికి అనుకూలంగా మారుతున్నాయని చెబుతున్నారు.