Latest Posts

బాలీవుడ్ దండయాత్రలో చోళ రాజులు – మణి మ్యాజిక్ హిట్ అయితే?

కొత్త కథను చెప్పడం… లేదంటే పాత కథనే కొత్తగా చెప్పడం… సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వాలంటే రెండు పాయింట్లలో ఏదో ఒకటి ఉండాలి. ఈ రెండు ఫార్మూలాల్లో ఏదో ఒకటి సరిగ్గా ఫాలో అయిన సినిమాలే బాక్సాఫీస్ బరిలో నిలబడగలుగుతాయి. ప్యాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ గా మారిన ఈ తరుణంలో మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్ 1’పై అందరి అంచనాలు నెలకొన్నాయి.

మణిరత్నం… ఈ పేరు గురించి, ఈ పేరు ఇండియన్ సినిమాలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియా అనే ట్రెండ్ లేని జమానాలో ఇండియా మొత్తం తన సినిమాలను విడుదల చేసిన అతి కొద్ది మంది దర్శకులలో మణిరత్నం ఒకరు. ‘రోజా’, ‘బొంబాయి’, ‘నాయకుడు’ దగ్గర నుంచి ‘గురు’, ‘విలన్’ వరకు మణిరత్నం తీసిన సినిమాలన్నీ అటు హిందీ ఆడియన్స్ కు కూడా చాలా బాగా తెలుసు. ఇప్పుడు కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో సినిమాను ఐదు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయిన మణిరత్నం..ఈ ప్రాజెక్ట్ లో మొదటి పార్ట్ ను ఈనెల 30న విడుదల చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉళగ నాయగన్ కమల్ హాసన్ చాలా ఏళ్ళ తర్వాత తర్వాత కలిసి వచ్చి మరీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా సినిమాపై బజ్ ఏర్పడింది.

చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలుడిగా, జయం రవి అరుణ్ మొళి వర్మగా, ఇంకా కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయరాం, ప్రకాష్ రాజ్, పార్తిబన్ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమా సొంతం. ఇప్పుడున్న ప్యాన్ ఇండియా ట్రెండ్ కు మణిరత్నం సత్తా ఏంటో చాటే మంచి అవకాశంగా సినీ విశ్లేషకులు పీఎస్ 1 ను భావిస్తున్నారు. ‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నానికి ఆ స్థాయి హిట్ లేదనే చెప్పాలి. ‘విలన్’, ‘నవాబ్’, ‘చెలియా’ చిత్రాలు మంచి పేరే తెచ్చుకున్నా… ఆ సినిమాలు కేవలం తమిళనాడుకే పరిమితమయ్యాయి. సో… ఇప్పుడు మణిరత్నానికి ఓ భారీ రేంజ్ హిట్ కావాలి. లేట్ 80s, 90s లోనే శంకర్, మణిరత్నం ప్యాన్ ఇండియా సినిమాలు తీయటం మొదలు పెట్టినా ఇప్పుడున్నంత ఆడియన్స్ ఎంగేజ్ మెంట్, స్కోప్ కానీ అప్పుడు లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. బాలీవుడ్ ఆడియన్స్ మొత్తం సౌత్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే సినిమా గ్రాండియర్ ను కళ్లకు కడుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే బాలీవుడ్ ను శాసించిన సౌత్ సినిమాల జాబితాలో మరో భారీ చిత్రం చేరి నట్లువుతుంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘కార్తికేయ 2’, ‘పుష్ప’ సినిమాలతో సౌత్ సినిమాలంటే గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తి హిందీ ఆడియన్స్ చూపిస్తున్నారు. ప్రతి సినిమాను చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్లకు కొత్తగా అనిపించే చోళరాజుల బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ బాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేయొచ్చని అంచనా. 

హిందీలో ఇటీవల అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’, రణ్ బీర్ కపూర్ నుంచి ‘షంషేరా’ వచ్చి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. అవన్నీ బాలీవుడ్ కు ఆల్రెడీ తెలిసిన కథలే. ఇప్పుడు తెలియని చోళ రాజుల కథను హిందీ ఆడియన్స్ ఆసక్తిగా గమనిస్తారని క్రిటిక్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరో వైపు సౌత్ ఆడియన్స్ కు ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి కథలు అలవాటే. ఈ చోళ రాజుల కాన్సెప్ట్ మీదే గతంలో ‘దశావతారం’, ‘యుగానికి ఒక్కడు’ లాంటి సినిమాలు వచ్చాయి. సో…  మణిరత్నం తెలిసిన కథను సౌత్ కు ఎంత కొత్తగా, తెలియని కథను నార్త్ కు ఎంత వినసొంపుగా చెబుతారనేది పెద్ద ప్రశ్న.

Also Read : రజనీకాంత్ కాళ్ళకు నమస్కరించిన ఐశ్వర్య

ఒకవేళ ‘పొన్నియన్ సెల్వన్’ కనుక క్లిక్ అయితే బాలీవుడ్ లో చాలా మార్పులు వచ్చే అవకాశమే ఉంది. ప్రత్యేకించి కథల విషయంలో బాలీవుడ్ అనుసరిస్తున్న బాంద్రా లైఫ్ స్టైల్, కల్చర్ పై ఇప్పటికే హిందీ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పుడు కల్చర్ రూటెడ్, హిస్టారికల్ రిఫరెన్సులతో వచ్చే ‘పొన్నియన్ సెల్వన్’ లాంటివి ప్రజాదరణ దక్కించుకుంటే రియాల్టీపైనే బాలీవుడ్ కూడా కాన్సట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల అక్షయ్ కుమార్ కూడా సౌత్ వాళ్లు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. సక్సెస్ అయితే మేం కూడా ఫాలో అవుతాం అన్నారు. సో ప్రస్తుతానికైతే ‘బ్రహ్మాస్త్ర’ తప్ప బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలేం లేవు. సో ప్యాన్ ఇండియా లో మణిరత్నం మ్యాజిక్ కనుక వర్కవుట్ అయితే….సౌత్ ఇండియన్ మూవీస్ రేంజ్ మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంది.

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం – మణిరత్నం తీసిన విజువల్ వండర్, ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్

Latest Posts

Don't Miss