Latest Posts

ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్ ! నరసింహన్ హయాంలో లేని విభేదాలు ఇప్పుడెందుకు ?

KCR Vs Governor :  తెలంగాణలో ప్రగతి భవన్ , రాజ్ భవన్ మధ్య వివాదం ముదురుతోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ..తెలంగాణ సర్కార్‌పై సందర్భం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును వివరిస్తున్నారు. ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలంటున్నారు. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్గాలు కూడా రాజకీయంగానే స్పందిస్తున్నాయి. గవర్నర్ పై విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తాను వ్యవహరిస్తున్న విధానంపై తానే ప్రశ్నించుకోవాలని అంటున్నారు. తమిళిసై బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. అయితే కేసీఆర్ గతంలో గవర్నర్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు .. ఆయన సలహాలతోనే అన్ని పనులు చేసేవారు. కానీ ఇప్పుడు తమిళిసైతో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. సీఎంకు నచ్చని పని గవర్నర్ ఏం చేశారు ? నరసింహన్ చేసినవే తమిళిసై చేస్తున్నా సీఎంకు ఎందుకు కోపం ? ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుంది ?

రాజ్‌భవన్‌ను కేసీఆర్ ఆవమానిస్తున్నారన్న ఆరోపణలు ! 

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఎట్ హోం విందు కర్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. మామూలుగా అయితే .. ఇది మామూలే కదా అనుకునేవారు. కానీ కేసీఆర్ వస్తున్నట్లుగా రాజ్ భవన్‌కు సమాచారం పంపారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కూడా ఆయన రాలేదు. ఇరవై నిమిషాల సేపు ఆయన కోసం వేచి ఉన్న తరవాత కేసీఆర్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందన్న సమాచారం రాజ్ భవన్‌కు వచ్చింది.  వస్తానని చెప్పి రాకపోవడం.. అసలు ప్రోగ్రాం ప్రారంభాన్ని వాయిదా వేసినా సరే.. ఇరవై నిమిషాల తర్వాత రావడం లేదని చెప్పడం.. రాజ్‌భవన్‌ను అవమానించినట్లు ఉందన్న అభిప్రాయం అందరికీ ఏర్పడింది. చివరికి గవర్నర్ కూడా అదే చెబుతున్నారు.  ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అప్పట్లో పరిస్థితి సద్దుమణిగిందనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేదని.. తాజా పరిణామాలతో తేలిపోయింది. 

అసలు రాజ్ భవన్‌ను గుర్తించని విధంగా ప్రభుత్వ వ్యవహారశైలి ! 

కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ మీద ఇప్పుడు ఓ రకంగా యుద్ధం ప్రకటించారు. గవర్నర్‌ను పూర్తి స్థాయిలో పట్టించుకోవడం మానేశారు. గణతంత్ర దినోత్సవాలు గవర్నర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంటుందని వాటిని నిర్వహించలేదు. ఆమె పర్యటనలకూ సహకరించడం లేదు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగమూ వద్దని డిసైడయ్యారు.  గవర్నర్‌ పై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారన్నది నిజం.  బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇటీవల గవర్నర్ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు.  ఈ రెండు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు గవర్నర్లు అడ్డు పడ్డారు. ఓ సందర్భంలో  మమతా బెనర్జీకి కేసీఆర్ సంఘిభావం తెలిపారు. అయితే ఇప్పుడు బెంగాల్ గవర్నర్ ఉపరాష్ట్రపతి అయ్యారు. దీంతో ఇప్పుడు తెలంగాణ గవర్నరే ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిలో ముందు ఉంటున్నారు. అందుకే కేసీఆర్ రాజ్ భవన్‌ను గుర్తించడానికి సిద్ధంగా లేరన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

గత గవర్నర్‌కు అత్యంత విలువ ఇచ్చిన కేసీఆర్ !   

తెలంగాణ సీఎం గవర్నర్ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేయడం కాస్త ఆశ్చర్యమే .  ఎందుకంటే  ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ ఉన్న సమయంలో కేసీఆర్ ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా రాజ్ భవన్‌కు వెళ్లి కలిసేవారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా కంటే తెలంగాణ గవర్నర్‌గా ప్రాచుర్యం పొందారు. వన్ సైడ్‌గా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వ విమర్శల పాలయ్యారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి ఆయన ఎంత సహకరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరికి ఆయన బదిలీ అయి వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. నరసింహన్ కూడా బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నరే. కాంగ్రెస్ హయాంలో నియమితులైనా బీజేపీ ప్రభుత్వం ఆయనకు రెండో టర్మ్ కొనసాగడానికి అవకాశం కల్పించింది. 

గవర్నర్లు రాజకీయాలు చేయాలనుకోవడంతోనే సమస్య ! 

రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానికి పరిమితులు ఉన్నాయి.. దానికి తగ్గట్లుగా గవర్నర్లు ఉంటే ఎప్పుడూ సమస్య రాదు. కానీ రాజకీయం పూర్తిగా డామినేట్ చేస్తోంది. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాలని కేంద్రం గవర్నర్లను పావుగా వాడుకుంటోంది. వారు అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. దాంతో ఎన్నో సార్లు గవర్నర్ వ్యవస్థపై చర్చ జరిగింది. అదే సమయంలో గవర్నర్ వ్యవస్థను తీసేయాలని అంటున్నవారు తాము అధికారంలోకి వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలన్నీ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దనే కోరుకుంటాయి. కానీ రాష్ట్రాల్లో పట్టులేకపోయినా గవర్నర్ల ద్వారా పాలన చేయడానికి జాతీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అందుకే గవర్నర్ వ్యవస్థ ఎప్పుడూ వివాదాస్పదమవుతూనే ఉంది  

Latest Posts

Don't Miss