Latest Posts

కూలిన తరగతి గది పైకప్పు, నలుగురు విద్యార్థులకు గాయాలు! 

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మహాత్మా గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల క్లాస్ రూము పైకప్పు పడి పోవడంతో నలుగురు విద్యార్ధులు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి విద్యార్ధి యశ్వంత్ తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురు విద్యార్ధులు తేజత ప్రభావ్, సంతోష్, మోహిత్ కుమార్ స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన అధ్యాపకులు వెంటనే వీరిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలోని 9వ తరగతి బి సెక్షన్ తరగతి గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు వైద్యం అందించిన వైద్యులు.. విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటా అపాయం లేదని తెలిపారు.

తమ పిల్లలకు ఏమైందోనని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..

పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లలకు ఏమైపోయిందోనని తెగ హైరానా పడిపోయారు. కానీ వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో.. కాస్త కుదుట పడ్డారు. తమ పిల్లల అదృష్టం బాగుండబట్టే పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. పిల్లలకు ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనాన్ని నిర్మించాలని కోరారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్..

పాఠశాలలో జరిగిన ఘటన గురించి తెలుసుకున్న నగర పాలక కమిషనర్ అనుపమ అంజలి హుటాహుటిని మహాత్మా గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఘటన జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. ల్యాబ్ లోని విద్యార్ధులను ఖాలీ చేయించి మరో క్లాస్ రూంకు తరలించారు. అయితే మహాత్మా గాంధీ నగర పాలక ఉన్నత పాఠశాల ఆవరణలో నాడు – నేడు ఫేజ్ -2  కింద కొత్తగా నాలుగు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు మరో మూడు నెలల్లో పూర్తి కానున్నాయని అధికారులు చెబుతున్నారు. పాఠశాల పాత భవనం కావడంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా క్లాస్ రూంలోని పైకప్పు ఊడి పడినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్ అనుపమ అంజలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Latest Posts

Don't Miss