Latest Posts

కరీంనగర్ ప్రభుత్వ బడుల్లో జ్వరాల టెన్షన్, అప్రమత్తమైన వైద్యశాఖ

Karimnagar Schools : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రకరకాల జ్వరాలతో బాధపడుతున్నారు. సాధారణ వైరల్ జ్వరాలతో పాటు డెంగీ లాంటి ప్రమాదకరమైన ఫీవర్లు బారిన పడుతున్నారు విద్యార్థులు. గత సంవత్సరంతో పోలిస్తే కేసుల సంఖ్య విపరీతంగా ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి ఆసుపత్రిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అసలే పరీక్షల సమయం కావడంతో జ్వరాల కారణంగా విద్యార్థుల హాజరు తగ్గుతుండడంతో అటు టీచర్లు ఇటు విద్యాశాఖ అధికారులను టెన్షన్ పడుతున్నారు.   

పరిశుభ్రత లోపించడం వల్లే 

 పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత లోపించడం వల్లే అనేక రకాలైన వ్యాధులు వస్తుంటాయని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3105 గవర్నమెంట్ స్కూల్స్ తోపాటు, 1545 ప్రైవేట్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, ఆదర్శ, గురుకులాలు, వసతి గృహాలు, మరో రెండు వందలు వరకు ఉన్నాయి. వీటన్నింటినిలో కలిపి సుమారు 4.5 లక్షల మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఇటీవల వర్షాలు కురిసిన తర్వాత చాలా చోట్ల పారిశుద్ధ్య సమస్య ఇబ్బందిగా మారుతుంది. కొన్ని వసతి గృహాలు, స్కూళ్లలో అపరిశుభ్రత వాతావరణంలో విద్యార్థులు రోజంతా ఉండాల్సి వస్తుంది. స్కూళ్లు,హాస్టల్స్ సదుపాయాలు ఉన్న భవనాల చెంతనే మురుగునీరు చేరడంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

పెరుగుతున్న జ్వర బాధితులు 

దోమల బెడద పెరగడంతో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.  నీరు నిలిచి ఉన్న నీటి కుండీలు, పిచ్చిమొక్కలు, పాఠశాలల చుట్టుపక్కల పందులు  తిరగడం, పేరుకున్న చెత్తచెదారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పారిశుద్ధ్య పరంగా ఎదురయ్యే ముప్పు తొలగడం లేదు. తాజాగా జ్వరాలు ఉమ్మడి జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే జ్వరంతో ఆసుపత్రులకు వెళుతున్న వారిలో పెద్దలతో పాటు,పిల్లలు ఉండటం కలవరానికి గురిచేస్తోంది. సీజన్లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తున్నా విద్యార్థులకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు.  తలనొప్పి, అలసట,శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం అనే సమస్యతో వైద్య పరీక్షలకు వెళ్లే వారి సంఖ్య నాలుగు జిల్లాల పరిధిలో క్రమంగా పెరుగుతూ వస్తోంది. 

తగ్గుతున్న హాజరు శాతం 

గడిచిన కొన్ని రోజులుగా ప్రభుత్వ,ప్రైవేటు విద్యార్థులు హాజరు శాతం తగ్గుతుంది. జలుబు, దగ్గు లాంటి ఏ ఇతర లక్షణాలు ఉన్నవారు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా స్కూళ్లకు పంపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లల ఆరోగ్యంపై కేర్ తీసుకుంటున్నారు. హాస్టల్స్, స్కూల్స్ లో ఏ మాత్రం అనారోగ్య కారణాలు ఉన్న వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో జ్వరం బారిన పడి చికిత్స అందుకుంటున్న చిన్నారుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడి పిల్లలు వార్డుకు 30 నుంచి 35 మంది చిన్నారులు వస్తున్నారు. ఇందులో 20 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. ఈ నెలలో ఇక్కడికి వచ్చిన వారిలో విష జ్వరాలతో పాటు ఇద్దరిలో డెంగీ లక్షణాలను వైద్యులు గుర్తించి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. 

Latest Posts

Don't Miss