Latest Posts

ఇండియా మ్యాచ్‌ చూసే ఇంట్రెస్ట్‌ లేదా! అఫ్గాన్‌ మ్యాచులన్నీ థ్రిల్లర్లే అని మరవొద్దు!

IND vs AFG, Super 4 Match Preview: ఆసియా కప్‌ -2022లో టీమ్‌ఇండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో తలపడుతోంది. హిట్‌మ్యాన్‌ సేన ఫైనల్‌ చేరుకోలేదు కాబట్టి ఈ మ్యాచ్‌పై ఎవరికీ ఆసక్తి లేదు. సూపర్‌-4లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి అవమానం పాలవ్వడంతో అంతా నిరాశతో ఉన్నారు. అయితే ఈ టోర్నీలో అఫ్గాన్‌ ఆడిన ప్రతి పోరూ ఉత్కంఠకు తెరతీయడంతో ఫ్యాన్స్‌ మరో థ్రిల్లర్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయడంలో తప్పేం లేదు!

టీమ్‌ఇండియాలో మార్పులు

ఈ టోర్నీలో టీమ్‌ఇండియా ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆటగాళ్ల ఎంపిక బాలేదని ఎంతోమంది పెదవి విరిచారు. కీలక ఆటగాళ్లను తీసుకోకుండా జూనియర్లను పంపడమేంటని ప్రశ్నించారు. జడ్డూ స్థానంలో వచ్చిన అక్షర్‌ పటేల్‌ను తీసుకోకపోవడంతో లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్ దెబ్బతిందని విశ్లేషిస్తున్నారు. పైగా కీలక పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్లు తీయకపోవడం, 19వ ఓవర్లో ఎక్కువ రన్స్‌ ఇవ్వడంతో ప్రత్యర్థులు విజయం సాధించారు. అందుకే ఈ మ్యాచులో మనం కొన్ని మార్పులు చూడొచ్చు! దీపక్‌ హుడా ప్లేస్‌లో అక్షర్‌ పటేల్‌ వస్తాడు. చెత్త షాట్లతో చిత్తవుతున్న రిషభ్ పంత్‌ బదులు డీకే రావడం ఖాయమే. అవేశ్‌ బదులు దీపక్‌ చాహర్ జట్టులోకి వచ్చాడో లేదో క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే భువీ స్థానంలో అతడికి చోటివ్వొచ్చు. యూజీ, యాష్‌లో ఒక్కరే ఆడతారు. అర్షదీప్‌ ఆడటం పక్కా!

అఫ్గాన్ థ్రిల్లర్‌

ఆసియాకప్‌లో అఫ్గాన్‌దీ భారత్ పరిస్థితే! లీగ్‌ స్టేజీలో అదరగొట్టి సూపర్‌-4లో వరుసగా 2 మ్యాచులు ఓడింది. శ్రీలంక, పాక్‌తో దాదాపుగా నోటిదాకా వచ్చిన విజయాలు త్రుటిలో దూరం చేసుకుంది. కాకపోతే ఈ టోర్నీలో అప్గాన్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠ రేకెత్తించింది. అభిమానులకు అంతులేని థ్రిల్‌ను పంచింది. ఎప్పట్లాగే ఈ జట్టును నిర్లక్ష్యం చేస్తే టీమ్‌ఇండియా హ్యాట్రిక్‌ ఓటములు ఎదుర్కొన్నా ఆశ్చర్యం లేదు. తెగించి ఆడే ఓపెనర్లు, మిడిలార్డర్‌ బ్యాటర్లు వారికున్నారు. ఇక వారి స్పిన్‌ బలం గురించి అందరికీ తెలిసిందే. పేస్‌లోనే కాస్త బలహీనంగా ఉంది. రషీద్‌ వికెట్లు తీసుకున్నా పరుగులు ఇవ్వడం లేదు. ముజీబుర్‌ గాయాలతో ఫామ్‌లో లేడు. జజాయ్‌, గుర్బాజ్‌, జద్రాన్ ద్వయం బ్యాటింగ్‌తో జాగ్రత్త అవసరం.

పిచ్‌ వీరికి అనుకూలం

ఈ మ్యాచ్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడి వాతావరణం చాలా ఉక్కగా ఉంటుంది. ఎక్కువ క్రికెట్‌ ఆడుతుండటంతో పిచ్‌లపై జీవం పోతోంది. వికెట్లు బ్యాటింగ్‌ నుంచి బౌలింగ్‌కు అనుకూలంగా మారుతున్నాయి. స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. ఎప్పట్లాగే తొలుత బౌలింగ్‌ చేసిన జట్లకే గెలుపు అవకాశాలు ఎక్కువ. అందుకే టాస్‌ కీలకం.

భారత్‌ x అఫ్గాన్‌ తుది జట్లు (అంచనా)

భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అశ్విన్‌ / యూజీ , అర్షదీప్‌ సింగ్‌

అఫ్గానిస్థాన్‌: హజ్రతుల్లా జజాయ్‌, రెహ్మతుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, కరీమ్‌ జనత్‌, రషీద్ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయి, నవీన్‌ ఉల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, ఫజల్‌ హఖ్‌ ఫరూఖీ

Latest Posts

Don't Miss