Amit Shah Mumbai visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం తలెత్తడం కలకలం రేపింది. ఈ వారం మొదట్లో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అమిత్ షా పర్యటించారు. ఆ సమయంలో హోంశాఖ అధికారిని అని చెప్పుకుంటూ అమిత్ షా వెంట తిరిగిన ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వ్యక్తి ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ పర్సనల్ సెక్రటరీగా గుర్తించినట్లు సమాచారం.
ఇదీ జరిగింది
అమిత్ షా.. ఈ వారం రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ భాజపా నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఆ పర్యటన ముగిసింది. అయితే ఈ పర్యటనలో ఓ భద్రతా వైఫల్యాన్ని అధికారులు గుర్తించారు.
ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. కొన్ని గంటల పాటు అమిత్ షాకు దగ్గర్లోనే తిరిగాడు. అయితే అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబయి పోలీసులకు సమాచారం అందించారు.
ఎవరతను?
పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని హేమంత్ పవార్‌గా గుర్తించారు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. హేమంత్ పవార్‌పై ఐపీసీ 170, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతను ఆంధ్రప్రదేశ్ ఎంపీ అనుచరుడినని, వ్యక్తిగత కార్యదర్శినని అతను చెప్పుకొన్నట్లు తెలిపారు. అయితే ఆ ఎంపీ ఎవరనేది ఇంకా తెలియలేదు.
” అమిత్ షా సోమవారం ముంబయి నగరానికి వచ్చిన సందర్భంగా గిర్గావ్ చుట్టూ ఉన్న పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ నివాసాలను సందర్శించేందుకు అమిత్ షా.. మలబార్ హిల్‌కు వెళ్లేందుకు సిద్ధమైన మార్గంలో మోహరించిన పోలీసు సిబ్బందిని నేను పర్యవేక్షించాను. అమిత్ షా.. ఫడణవీస్ నివాసానికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు.. తెల్లటి చొక్కా, నీలిరంగు బ్లేజర్ ధరించిన వ్యక్తిని నేను అక్కడ గమనించాను. అతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు కార్డును ధరించాడు. అయితే ఆ వ్యక్తి నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించాం. కొన్ని గంటల తర్వాత అదే వ్యక్తిని సీఎం శిందే అధికారిక నివాసం వెలుపల చూశాను. దీంతో ఆ వ్యక్తిని విచారించాం. అతను తన పేరు హేమంత్ పవార్ అని, తాను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సభ్యుడినని పేర్కొన్నాడు. ” -నీల్కాంత్ పాటిల్, ఏసీపీ ముంబయి
Also Read: Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 6 వేల మందికి వైరస్
Also Read: Bharat jodo Yatra : మనందరం భారత్‌ను ఏకం చేద్దాం – పాదయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ పిలుపు