పలాస పర్యటనలో ఉద్రిక్తత, పోలీసుల అదుపులో నారా లోకేశ్

Nara Lokesh: పలాసలో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నారా లోకేశ్ పలాసకు వస్తుండగా శ్రీకాకుళం హైవేపై పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెనఅషన్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు పలాస రాబోతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పలాస పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డుమార్గంలో వెళ్తోన్న లోకేశ్ ను శ్రీకాకుళం సమీపంలో హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొత్తరోడ్డు కూడలి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్పతో సహా ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

నేతలు, పోలీసుల మధ్య తోపులాట..!

అలాగే పలాస నందిగామ మండలం పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ వివాహానికి వెళ్తోన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లికి వెళ్లొద్దని పోలీసులు అడ్డుకున్నారు. పలాసలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో నారా లోకేశ్ పలాస చేరుకోనున్నారు. ఇప్పటికే పలాసలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఓవైపు వైసీపీ పిలుపు, మరోవైపు లోకేష్ పర్యటన..

ఆదివారం ఓవైపు వైసీపీ  శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో  టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారమే పలాస పర్యటన ఖరారు చేశారు. జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు వివాహానికి వస్తున్న లోకేష్.. పలాస కూడా వెళ్లి అక్కడి కౌన్సిలర్ సూర్య నారాయణకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఆ పట్టణానికి చేరుకున్నారు. శుక్రవారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిరీషను లక్ష్మీపురం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డు కుని వెనక్కి పంపించిన విషయం విదితమే. శనివారం మరలా ఎంపీ, శిరీష వెళ్లి మీడియా సమావేశంలో పాల్గొని అధికార పక్షాన్ని, మంత్రి  అప్పలరాజును దుయ్యబట్టారు. రాజకీయ పోరులో తగ్గేదేలే అన్నట్టుగా సవాళ్లు విసురుకుంటున్నారు.


అధికారులు ఆ కాలనీ విషయం తేల్చాల్సిందిపోయి ఆ పార్టీ నేతలే స్వయంగా రంగ ప్రవేశం చేసి  అప్పల సూర్యనారాయణ ఇల్లును కూలదోయడమే లక్ష్యంగా ప్రకటనలు చేయడం ఓవైపు చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు మంత్రి అప్పలరాజుపై కూడా టీడీపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలను ప్రతిష్టా త్మకంగా తీసుకుని తమ పవర్ ఏమిటో చూపి స్తామన్న ధోరణిలో వైసీపీ శ్రేణులు ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.