మెగా హీరోలను కలిసే సదావకాశం.. మెగా కార్నివాల్‌కు వచ్చేయండి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న రానుంది. దీంతో ఇప్పటికే ఆయన బర్త్ డే వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా లాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకోనున్నారు. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఒక ఎత్తయితే.. మెగా ఫ్యామిలీ చేసే సందడి మరో ఎత్తు. ఎప్పుడూ చిరు పుట్టిన రోజును ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి మాత్రం వినూత్న రీతిలో జరపనున్నారు. ఈ సారి మెగాస్టార్ పుట్టిన రోజును మెగా కార్నివాల్ పేరుతో వేడుకలాగా నిర్వహించనున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు.

మెగా కార్నివాల్‌లో మెగా అభిమానులు ఎవ్వరైనా హాజరు కావచ్చని నాగబాబు తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రామాన్ని వేడుక తరహాలో ఉంటాయని నాగబాబు స్పష్టం చేశారు. ప్రతి అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పారు.

“ఆగస్టు 22న అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా చేస్తున్నాం. అభిమానులతో కలిసి కార్నివాల్, జాతర తరహాలో వేడుకలు ఉంటాయి. ఇండియాలో ఏ హీరోకు జరపని విధంగా మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఈ మెగా కార్నివాల్ ప్రతి అభిమానికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రతి మెగా అభిమాని మెగా కార్నివాల్‌కు హాజరు కావచ్చు. వచ్చిన వారందరికీ అన్ని వసతులు కల్పిస్తాం. హైటెక్స్‌లో జరిగే ఈ మెగా కార్నివాల్‌లో మెగా హీరోలంతా పాల్గొంటారు” అని నాగబాబు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న గాడ్ ఫాదర్ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్టు 21 ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా కార్నివాల్ (Twitter)

మెగా హీరోలను కలిసే సదావకాశం.. మెగా కార్నివాల్‌కు వచ్చేయండి