కామాన్ యః కామయతే మన్యమానః స కామఖిః జాయతే తత్ర తత్ర। ముండకోపనిషత్ 3-2-2

స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి

కామములనే చింతిస్తూ, ఎవడు కామములనే కోరుకొనుచుంటాడో, అటువంటి అవివేకి మరణానంతరము ఆయా కామములై పుడతాడు.కామి అయినవాడు కామిగానే జీవిస్తూ కామిగానే పుట్టవలసి వున్నది. కామమనెడి మాటకు “కామ్యంతే ఇతి కామాః”, కోరబడెడు వస్తువులనియూ, “కామనం కామః” కోరుకొనుట -అనియూ రెండర్ధములున్నవి. కామములు కలుగునది అవిద్య చేత; అవిద్యవున్న వానికి అనాత్మలయొక్క కామములు లేచుట సహజము. కామముచే కర్మము, కర్మముచే జన్మప్రాప్తి, అనంతరము సుఖదుఃఖసంసారము అవ్యాహతముగా సాగుచున్నది.

ఆత్మ స్వరూపమునుతెలుసుకొనని అజ్ఞానికి సదా అనాత్మ చింతన, విషయాభిధ్యానము; శబ్దస్పర్శరూపరస గంధములను చింతించుటే ఇతని పని. దీనికే ‘కామ’మని పేరు. ఈ కామముంటే, అంతేచాలు. దానివలన కావలసినంత అనాహుతము! “విషయాభిధ్యానం సర్వానర్ధమూలమ్” అని గీతాభాష్యము. కామచింతకునికి, కామమయునికి, కామరామునికి, కామకామునికి, కామములను విడచి వేరేమియూ తెలీనే తెలీదు. కామాత్మునికి కామములే గతి!!
॥ఓం శాంతిః శాంతిః శాంతిః॥