కోనసీమ అల్లర్లలో అమాయకులను కాపడుతాం… తోట, బోస్ సంయుక్త ప్రకటన

కోనసీమ జిల్లా పేరు ఏర్పాటు అంశంలో చోటుచేసున్న హింసాకాండ కు సంబంధించిన అమాయక యువత ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ లు పేర్కొన్నారు. మండపేట లోని విజయలక్ష్మి నగర్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోట, బోస్ లు సంయుక్తంగా మాట్లాడారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన వారిని కాకుండా ఎందరో అమాయకులు కూడా కేసుల్లో ఇరుకున్నారని పేర్కొన్నారు. అక్కడి కాపు, బీసీ కులాలు వారే కాకుండా ఇంకా ఇతరులు తమని ఆశ్రయించారన్నారు.

కోనసీమ అల్లర్లు కు సంబంధించిన ఉద్రిక్తత పరిస్థితుల్లో కొందరు ఏమి తెలియకుండానే బలి అయ్యారని పేర్కొన్నారు. క్షణికావేశంలో కొందరు యువకులు ఘటనలో పాల్గొన్నారని అయితే హింసలో మాత్రం చాలా మంది అమాయకులు లేరన్నారు. కాగా పోలీసులు ఈ కేసును చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసారని కితాబు ఇచ్చారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు. కాగా అల్లర్లు జరిగిన సమయంలో ఉద్దేశపూర్వకంగా హింస ను ప్రోత్సాహపరిచిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని అందులో ఎలాంటి ఢోకా లేదన్నారు. అమాయకులను మాత్రమే తాము రక్షిస్తామని చెప్పారు. ఈ ఘటన అనంతరం పోలీసులు వెతుకుతూ ఉంటే ఇల్లు, ఊరు వదిలి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు తనను, బోస్ ను ఆశ్రయించారన్నారు. స్వతహాగా బోసుకు తనకు బంధువులు, స్నేహితులు కోనసీమలో ఎక్కువగా ఉన్నారన్నారు. వారంతా తమ పిల్లల చదువులు కోసం ఆత్రుత పడుతూ తమ వద్ద ఆవేదన వ్యక్తంచేశారన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న ఈ యువకులు ఈ కేసుల్లో ఇరుక్కున్నారని పేర్కొన్నారు. వారి కోసం తాము ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఇక్కడి వాస్తవాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో విధ్వంసం ప్రోత్సహించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అదే సమయంలో ప్రేరేపిత ఉద్రేకానికి లోనై వెళ్లిన వారి అంశం లో ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్న కుటుంబ ల కోసం వారికి అండగా నిలుద్దామని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ రోజు కోనసీమ సమితి వినతిపత్రం ఇచ్చే ఉద్దేశ్యం తో వెళితే ఆ గుంపు లో అసాంఘిక శక్తులు చొరబడ్డారని పేర్కొన్నారు. తాము అప్పుడే ఈ అంశాన్ని లేవనెత్తి అక్కడికి వెళ్లాలని అనుకున్నామని కాగా పరిస్థితి మరింత ఉద్రిక్తత కు దారి తీస్తుందని ఆలోచించి సంయమనం పాటించామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ అంశంలో అమాయకులను రక్షించేందుకు తాము కృషి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సి ఎం ను కలిసి ఈ కుటుంబ లకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నుక దుర్గా రాణి, వైఎస్సార్సీపీ నేతలు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి,ముమ్మిడివరపు బాపిరాజు, వల్లూరి రామకృష్ణ, రెడ్డి రాధాకృష్ణ,పెంకే గంగాధర్, సాధనాల శివ భగవాన్, పిల్లా వీరబాబు,పోతంశెట్టి ప్రసాద్, పలివేల సుధాకర్,చోడే సత్య కృష్ణ,మీగడ శ్రీనివాసరావు,పిల్లి గణేష్,తదితరులు పాల్గొన్నారు.