అప్రాణో హ్యమనాః శుభ్రో హ్యక్షరాత్ పరతః పరః। – ముండకోపనిషత్ 2-1-2

ఆత్మ అప్రాణుడు, అమనస్కుడు, శుభ్రుడు మరియు పరమమైన అక్షరముకంటెనూ పరమమైనవాడు.

ఉపనిషత్ ప్రతిపాద్యుడైన ఆత్మ లోపలా బయటా నిండుకొని వుంటాడు. ఆత్మ అప్రాణుడు అంటే ప్రాణ సంబంధము లేనివాడు. ఆత్మ నుండి ప్రాణము పుట్టుట వలన ఆత్మకు ప్రాణముయొక్క పొత్తు వుండదు. ప్రాణము వున్ననూ పోయిననూ ఆత్మకు దానివలన ఏమియూ అవదు ఆత్మ అమననుడు, అంటే మనస్సు యొక్క సంబంధము లేనివాడు. ఆత్మనుండే మనస్సు పుట్టివున్నది. ఆత్మనుండే మనస్సుకు అస్తిత్వము. మనస్సుకూ సాక్షియైనట్టి ఆత్మకు మనస్సు యొక్క పొత్తు వుండదు. మనస్సూ ప్రాణమూ అనాత్మలే.

ఆత్మ శుభ్రుడు, అంటే పుణ్యపాపములయొక్క సంబంధములేనివాడు. ఆత్మకు త్రిగుణములయొక్క సంబంధముగానీ, దేశకాలములయొక్క సంబంధముగానీ లేనందువలన ఆత్మ నిత్యశుద్ధుడు. ఆత్మ అవ్యాకృతముకంటెనూ సూక్ష్మడై వుంటాడు. సాంఖ్యదర్శనములోని ప్రధానమూ సూక్ష్మమూ పరమమూ అయ్యుండును. అయితే వేదాంతమందు ప్రధానముకంటెనూ సూక్ష్మమైనది ఆత్మతత్త్వము. దీనిని తానే అని తెలుసుకొనుటయే ఆత్మ జ్ఞానము. ఇదే వేదాంత వైశిష్ట్యము.
।ఓం శాంతిః శాంతిః శాంతిః।