రాజాసింగ్ అలక

కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్రలో ఎమ్యెల్యే రాజాసింగ్ ఆ నియోజకవర్గ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. యాత్ర ముగింపు సభలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. రాజాసింగ్ ప్రసంగం విందామని వచ్చిన జనం, పార్టీ క్యాడర్ ఊసురు మంటూ వెళ్లిపోగా.. సభకు వచ్చిన నేతలు పది నిమిషాల్లోనే.. ముగింపు పలికారట. ఇంతకీ రాజాసింగ్ అలకకు కారణమేంటి ? పార్టీ సభలో మాట్లాడకుండా ఆయను ఎందుకు వెనుదిరిగారు?… అసలు బిజెపి పార్టీ లో ఎం జరుగుతుందో ?

ఊహించని షాక్ ఇచ్చిన రాజసింగ్

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా  ప్రణాళికలు సిద్దం చేసిన కాషాయ పార్టీ… ప్రజాగోస బీజీపీ భరోసా పేరుతో 10 రోజుల పాటు 14 నియోజక వర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జిల్లా నాయకత్వం భరోసా యాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన  బైక్ యాత్రను మొదలు పెట్టారు. అప్పటి నుంచి బోధన్ లో మకాం వేసిన రాజాసింగ్ నియోజకవర్గాన్ని చుట్చొచ్చారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు స్ధానిక ఎమ్మెల్యే పై తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా మధ్య మధ్యలో రాజా సింగ్ స్ధానిక బీజేపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. నవీపేట తో పాటు బోధన్ లో జనసమీకరణ చేయలేదని యాత్ర మధ్యలో అసంతృప్తితో వెనుదిరిగారు రాజాసింగ్. ముగింపు సభ లో ప్రసంగించాల్సి ఉన్నా.. జనసమీకరణ లేకపోవడంతో యాత్ర మధ్యలోంచి వెళ్లిపోయారు. ఆ ఊహించని పరిణామంతో పార్టీ క్యాడర్ అవాక్కయ్యారు.

క్యాడర్ ఉన్నా- నాయుకుడు లేడు

బోధన్ నియోజకవర్గంలో కాషాయ పార్టీ వీక్ గా ఉంది. క్యాడర్ ఉన్నా.. సరైన నాయకుడు లేక పార్టీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నారు. బోధన్ లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్యాడర్ ప్రజల్లో ఉండేలా ప్రజా గోస -బీజేపీ భరోసా చేపట్టారు. మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. ఈ నియోజకవర్గంలో పర్యటనకు రాజాసింగ్ ను  రప్పించారు. రాజాసింగ్ బోధన్ లో ఉండి యాత్ర చేస్తే.. పార్టీ బలపడుతుందని అందరూ ఊహించారు. కానీ నేతల సమన్వయ లోపం.. బీజేపీ భరోసా యాత్రపై ప్రభావం చూపింది. జనసమీకరణ లో నేతలు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ కారణంగా రాజాసింగ్ అసహనానికి లోనయ్యారు. సభలో స్టేజీ ఎక్కకుండానే అర్దాంతరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామంతో నేతలు షాక్ కు గురయ్యారు. బిజెపి బోధన లో వీక్ గా ఉన్న నేపథ్యంలో ఇటివల అధికార పార్టీ కి చెందిన నేతలు బిజెపిలో చేరారు. దాంతో  బిజెపి పార్టీ బలోపెతమవుతుందని రాష్ట్ర నాయకత్వంలో నమ్మకం పెరిగింది. ఎలాగైనా బోధన లో బిజేపి పాగా వేసేందుకు సిద్దం చేసుకుంది.

ఆ క్రమంలో రాజాసింగ్ పర్యటన పార్టీలో ఉత్సాహం నింపుతుందని భావించారు. కొంత మేర అది జరిగినా.. ముగింపు సభ జనాలు లేక నిరాశకు గురిచేసింది.. ఇకనైనా బిజెపి నేతలు స్ట్రాంగ్ గా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవకశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.