మునుగోడులో పార్టీ పరిస్థితిలపై కెసిఆర్ సర్వే.. వాస్తవం ఏమిటంటే ..?

మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఎవరికో ఖరారు అయినట్లేనా?  మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల వైపే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నారా? కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలను మంత్రి జగదీష్ రెడ్డి బుజ్జగింపులు వెనుక ఆంతర్యం ఇదేనా? … మునుగోడు అభ్యర్థిని ఖరారు చేసి స్పీడు పెంచాలని గులాబీ బాస్ భావిస్తున్నారా?… అసలు మునుగోడు టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

మునుగోడు…ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎవరి నోట విన్నా మునుగోడు బై పోల్ పైనే చర్చ నడుస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడొస్తుంది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు నిలబడతారు. ఎవరు గెలుస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకుంది. ఇదిలా ఉంటే బిజెపి అభ్యర్థిగా రాజ గోపాల్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయమైనట్లే.  ఇక టిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ అనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.

కాంగ్రెస్ ఫోకస్

ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నుంచి నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో ఆ పార్టీ హై కమాండ్ పడింది. టిఆర్ఎస్ లో అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాములా మారిందంటున్నారు. టికెట్ కోసం నలుగురు ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో పనిచేసిన కూసుకుంట్ల టికెట్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇప్పటికే మునుగోడు నియోజక వర్గంలో  పార్టీ పరిస్థితి, పలువురు నేతలపై సర్వేలు చేయించారు గులాబీ బాస్.. ఆ సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకే అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మిగతా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ కేటాయిస్తే తాము పని చేసేది లేదని బహిరంగంగానే చెబుతున్నారట.ఇప్పటికే కొంతమంది ప్రజా ప్రతినిధులు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ అయ్యారట. దీంతో పార్టీ హై కమాండ్ రంగంలోకి దిగింది.

ఆ క్రమంలో సదరు అసమ్మతి నేతలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రగతిభవన్‌కు తీసుకొచ్చి  ముఖ్యమంత్రితో మాట్లాడించాలని ఆయన ప్రయత్నించారట. అయితే వారికి సీఎం అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో వారు పార్టీ కోసం ఏ మాత్రం పనిచేస్తారో ?. అభ్యర్థికి ఎంతవరకు సహకరిస్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే మునుగోడుపై పట్టు సాధించేలా మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీల నుంచి నేతలను కారెక్కించే పనిలో పడ్డారు. ఇక అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డి కి అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలతో మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో సమస్యలు ఉంటే తాను పరిష్కరిస్తానని, అందరూ కలిసి కట్టుగా ఎన్నికల్లో పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీలో అసమ్మతి లేకుండా చేసి  టిఆర్ఎస్ అభ్యర్థిని ఫైనల్ చేసి మునుగోడులో జోరు పెంచాలని భావిస్తోంది గులాబీ పార్టీ. మరి ఆ వర్గపోరు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.