మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ ?

మునుగోడు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలకు ఆ గ్రామాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయా…? ఆ గ్రామాల పేరు వింటే రాజకీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైందా…? ఆ గ్రామాలు చేసే పనికి రాజకీయ పార్టీలే కాదు..ఎన్నికల కమిషన్ కూడా తలలు పట్టుకోబోతుందా…? ఈ ఎన్నిక దేశ వ్యాప్తచర్చకు దారితీయబోతుందా…? ఇంతకీ అంతలా మునుగోడు లో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ గ్రామాలు ఏంటో?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మునుగోడు గురించే చర్చ..ఏ ఇద్దరు మాట్లాడిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు పైన బెట్టింగ్ లో వాదోపవాదాలు. ఇటు గెలుపు మాదంటే మాదేనని అధికార టీఆర్ఎస్, బీజేపీ లు వ్యూహాలు పన్నుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్ని పార్టీలు మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయింది. ఈ అన్ని పార్టీలకు అక్కడ ఉన్న ఆ గ్రామాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయట. ఆ గ్రామాల పేర్లు చెప్తే ఆయా పార్టీలకు వెన్నులో వణుకు మొదలయిందట.

ఇంతకీ ఆ గ్రామాలు ఎవనుకుంటున్నారా. అవే దిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా మర్రిగూడా మండలంలోని కిష్టరాయపల్లి, శివన్న గూడెం ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు నర్సిరెడ్డి గూడెం,చర్ల గూడెం, వెంకపల్లి తండా ,శివన్న గూడెం ఉన్నాయి. కిష్టరాయపల్లి ప్రాజెక్టు కింద ఈదుల గండి, లక్ష్మపూర్ గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు మాదిరి ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు కింద పరిహారం చెల్లించలేదు. వారికి 13 లక్షలకు కేవలం 5 లక్షల 15వేలు మాత్రమే ఇస్తున్నారని ఇంటి నిర్మాణానికి జీవో 120 ప్రకారం 5లక్షలు ఇవ్వాలని కానీ లక్షా 25 వేలు మాత్రమే ఇస్తున్నారని నిర్వాసితులు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ ఏడూ గ్రామాల ప్రజలకు మునుగోడు ఉప ఎన్నిక వరంగా మారింది.

ఈ భూ నిర్వాసితులు మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు. తమకి పరిహారం ఇవ్వని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడబోతున్నారా. లేక ఎమ్మెల్యే గా ఉండి తమ గురించి ఏనాడు పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా నిలబడబోన్నారా ? అని అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. వీరంత దేశ వ్యాప్తంగా తమ సమస్యపై చర్చ లేపడానికి దాదాపు 1200 కుటుంబాలు ఇంటికి ఒకరు చొప్పున 1200 నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే ఆయా గ్రామాల్లో యువత వాట్సప్ గ్రూప్ లు పెట్టి మరి చర్చకు తెరలేపారట. అయితే ఈ నామినేషన్లు ఇటు రాజకీయ పార్టీలకే కాదు ఎన్నికల కమిషన్ కి సైతం కొత్త తలనొప్పులు రాబోతున్నాయట. ఈ 1200 మంది నామినేషన్ వేస్తే బుక్ లెట్ టైప్ బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది. మరోవైపు ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అని పార్టీలు బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి. గతంలో 1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లోరైడ్ విముక్తి కోసం 682 నామినేషన్లు వేసి తమ సమస్యను దేశం తమ వైపుకు తిప్పుకునేలా చేశారట. తాజాగా మునుగోడు లో కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారట.

గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు భారీగా నామినేషన్ వేసి కవిత ఓటమి కి కారణయ్యారు. అయితే ఇప్పుడు భూ నిర్వాసితుల పక్షాన కూడా పోరాడి వాళ్లకు అండగా ఉండడం కానీ..లేదంటే ఈ ఎన్నిక మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీయకున్నాయి కాబట్టి గెలుపు కోసం ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తే అటు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ అవేమి కుదరకపోతే ఈ 1200 మంది నామినేషన్లు వేస్తే ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరిస్తోందో సర్వత్రా ఆసక్తి గా మారింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటికే అన్ని పార్టీలు అక్కడే మకాం వేసి మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా ఈ భూ నిర్వాసితులు వేస్తున్న నామినేషన్ల వ్యూహం ఎవరికి దెబ్బ కొడుతుందో చూడాలి మరి.