అథాత ఆదేశో ‘నేతి నేతి’, నహ్యేతస్మాదితి నేతి, అన్యత్ పరమస్తి।


బృహదారణ్యకోపనిషత్ 2-3-6
ఇక బ్రహ్మ యొక్క ఆదేశమేమిటంటే, ‘నేతి నేతి’ అనునది. ఈ ఆదేశము కంటె వేరే రీతి ఆదేశము లేదు. దీనికంటె శ్రేష్ఠమైన ఉపదేశక్రమము లేదు.

‘నేతి నేతి’ అనునది పరబ్రహ్మమును తెలియజేసెడు బీజమంత్రము. పరబ్రహ్మము పరిపూర్ణమైనందువలననూ నిరుపాధిక మైనందువలననూ దానిని ఎటువంటి విశేషణములతోనూ ఎటువంటి ధర్మములతోనూ తెలుపుటకు సాధ్యమే లేదు. ఏ శబ్ధములతోనూ ఎట్లు తెలిపిననూ అది బ్రహ్మ యొక్క నిజమైన స్వరూపము కాదు.
అట్లైతే వేరే దారేది? మనకు గతేమిటి? అంటే ‘నేతి నేతి’ అనునదొక్కటే గతి. న ఇతి, న ఇతి అనియే బ్రహ్మమును తెలుపవలెను. ‘న ఇతి’ అనుదానిని ‘ఇతి న’ అని పరివర్తించుకొని ‘ఇది కాదు’ ‘ఇది కాదు’ అనియే తెలుపవలెను. బ్రహ్మము తెలుపు కాదు, నలుపు కాదు, లావు కాదు, సన్నమూకాదు, పొదుపుకాదు, పొట్టికాదు, కారణముకాదు, కార్యమూ కాదు అనియే తెలుసుకోవలెను. అట్లైతే శూన్యమా? అంటే అప్పుడు రెండవ “నేతి” కారము. బ్రహ్మము శూన్యమూ కాదు. ఇలా “నేతి నేతి” అని అధ్యారోపవాద క్రమముతోనే పరబ్రహ్మమును తెలుపవలెనేగాని వేరే దారియే లేదు.