కేటీఆర్‌కు పెద్ద సవాల్‌

big challenge for ktr
big challenge for ktr

ఉపఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకుని టీఆర్ఎస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించినా రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడకుండా తయారైంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ, తాజాగా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించి గులాబీ పార్టీకి గట్టి సవాలే విసిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందా ? అనే చర్చ ఇప్పడు జోరుగా సాగుతోంది. మరో బైపోల్‌పై బీజేపీ ఎమ్మెల్యేనే జోస్యం చెపుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు తెలంగాణలో నాలుగు సార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య మరణంతో దుబ్బాక, నాగార్జునసాగర్‌, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

వీటిలో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకోగా, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ.. తాజాగా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించి గులాబీ పార్టీకి పెద్ద సవాలే విసిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై కోర్టులో ఎప్పటి నుంచో కేసు కొనసాగుతోంది. దీనిపై చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే, అక్కడ మళ్లీ ఉప ఎన్నిక వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడీయా ముందు వ్యాఖ్యానించారు. అక్కడ కూడా తామే కచ్చితంగా గెలుస్తామన్నారు. ఈటల రాజేందర్ గెలుపు తరువాత ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రఘునందన్ రావు అంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమను మళ్లీ గెలిపించుకునే బాధ్యత తీసుకుంటే.. తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్లు తనతో చెప్పారని ఆయన వ్యాఖ్యానించి రాజకీయకలకలం రేపారు.

వారితో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఎమ్మెల్యేల రాజీనామాలు ఎలా ఉన్నా.. వేములవాడకు ఉప ఎన్నిక కచ్చితంగా వస్తుందనే ధీమాతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి సైతం తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధం కావాలని అన్నట్టుగా వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.

ఈ కేసు విచారణ వేగవంతమై సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పేతే.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వస్తే, అది కేటీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.