హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ పరాజయానికి కారణాలివే ?

టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పరాజయానికి కారణమేంటి ? ప్రత్యర్థి ఈటలను తక్కువగా అంచనా వేశామని గులాబీ నేతలు భావిస్తున్నారా?  దళితబంధు లాంటి పథకాలను ప్రకటించినా, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించినా, విజయలక్ష్మి ఎందుకు వరించలేదు? గత ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా ఓటుబ్యాంకు లేకపోయినా, ఈటల వైపే జనం ఎందుకు మొగ్గుచూపారు? ఇవీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ముఖ్యుల్లో జరుగుతున్న చర్చ.ఆ క్రమంలో దళితబంధు కొనసాగింపుపై ఆ పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమితో అధికార టీఆర్‌ఎస్‌ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. శాయశక్తులా ప్రయత్నించినా వ్యతిరేక ఫలితం రావడంపై విశ్లేషించుకుంటున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో పరాజయానికి కారణాలపై పార్టీ ముఖ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బయటికి బీజేపీతో కాంగ్రెస్‌ కుమ్మక్కవ్వడం వల్లే తాము ఓడిపోయామని చెబుతున్నప్పటికీ.. అంతర్గత సంభాషణల్లో మాత్రం స్వయంకృతాపరాధాలను ప్రస్తావిస్తున్నారంట. ఈటలపై అసైన్డ్‌ భూముల కబ్జా ఆరోపణలు రావటం మొదలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వరకు పార్టీపరమైన తప్పిదాలను ఈ సందర్భంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈటలను సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ పెద్దలు కార్నర్‌ చేశారనే భావన ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈటల రాజేందర్‌ కేబినెట్‌ మంత్రిగా కొనసాగుతూ, పలు వేదికలపై అడపాదడపా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ, అంతలోనే సర్దుకునేవారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై అసైన్డ్‌ భూముల కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు,..విచారణ, బర్తరఫ్‌ వంటి కఠిన నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే సమాచారం పక్కాగా ఉన్నప్పుడు, అసైన్డ్‌ భూముల కబ్జా వెలుగులోకి రావడానికి ముందే ప్రభుత్వంలో ఈటల ప్రాధాన్యత తగ్గించడమో.. మరో శాఖకు మార్చడమో చేసి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని… ఆయనపై సానుభూతి వెల్లువెత్తేది కాదని అంటున్నారు. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయటం ద్వారా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తనంతట తానుగా ఈటల రాజీనామా చేసే విధంగా చేసినట్లయిందని అప్పటి పరిస్థితిని గుర్తుచేసుకుంటున్నారు.

వామపక్ష, తెలంగాణ భావనలు ఉండే ఈటల.. హిందూత్వ పార్టీ అయిన బీజేపీ పంచన చేరడానికి కూడా ప్రభుత్వం ఆయనపై అతిగా ఫోకస్‌ చేయడమే కారణమన్న టాక్ గులాబీశ్రేణుల్లో వినిపిస్తోంది. ఈటల కబ్జాలపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటైన తర్వాత.. వెనువెంటనే విచారణలు జరపడం.. నివేదికలను అందజేయడాన్ని బట్టి.. ఈటలను పక్కాగా కార్నర్‌ చేస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లిందంటున్నారు. హైకోర్టు కూడా ఈ కమిటీ ఆగమేఘాలపై నివేదికలు ఇవ్వడాన్ని తప్పుబట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీకి పెద్దగా బలం లేకున్నా.. ఈటల పంచన ఓటర్లు చేరడానికి ఈ చర్యలన్నీ దోహదపడ్డాయనే వాదన పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఎక్కువగా ఫోకస్‌ చేయడం కూడా కొంప ముంచిందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలో ఒక దశలో ఈ ఎన్నిక ఈటల వర్సెస్‌ గెల్లు శ్రీనివాస్‌ అనో.. బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అనో కాకుండా.. ఈటల వర్సెస్‌ సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా మారిపోయింది. దళిత బంధు ప్రకటనే కాకుండా స్థానికేతర నేతలను ప్రచారం కోసం పెద్ద ఎత్తున మోహరించడం వంటి పరిణామాలతో లాభాలకంటే నష్టాలే ఎక్కువ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలువటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఓటమి తప్పదనే విషయం టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ముందే తెలుసా? అనే సందేహాలను కొందరు పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు

హుజూరాబాద్‌లో ఓడిపోతే టీఆర్‌ఎస్‌ శ్రేణులు డీలా పడకుండా ఉండటానికే సరిగ్గా ఉప ఎన్నికల సమయంలోనే సంస్థాగత కార్యక్రమాలను వేగం చేశారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నాయకుల నియోజకవర్గాలు మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించటాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలు లేకుండానే గత నెల 25న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ పేరిట పార్టీ ప్రతినిధుల సభ జరగటాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడానికి గల కారణాలను ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లలేకపోవడం కూడా ఓటమికి ఓ ముఖ్య కారణమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ నుంచి ఒక్కసారి కూడా బహిరంగ ప్రకటన రాకపోవటాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఈటలపై నియోజకవర్గంలో సానుభూతి పెరగటానికి దోహదపడ్డాయని అంటున్నారు.

టీఆర్‌ఎస్‌లో కొనసాగినంతకాలం ఈటలకు ఏం తక్కువ చేశామని మాత్రమే ఉప ఎన్నికల ప్రచారంలో చెప్పటం ఆయనకు అనుకూలంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతో వ్యయం చేసినా, ముగ్గురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నెలల తరబడి అక్కడే ఉంచి తిప్పినా.. ఫలితం సానుకూలంగా రాకపోవటానికి ప్రభుత్వంపై వ్యతిరేకత కంటే ఈటలపై సానుభూతి ఎక్కువగా ఉండటమే కారణమని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ సానుభూతి ఓటర్లు కూడా ఈటలను బీజేపీ అభ్యర్థిగా కాకుండా వ్యక్తిగతంగానే చూశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ లోకల్‌ లీడర్లలో చాలామంది ఈటలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పోలింగ్‌ నాటికి ఆయనవైపు మొగ్గుచూపారంట.

మొత్తమ్మీద హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో దళిత బంధు పథకంపై టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి వార్షిక బడ్జెట్‌లో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకానికి వెయ్యి కోట్లు కేటాయించారు. సరిగ్గా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ముందు దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పేరును దళిత బంధుగా మార్చి, పైలెట్‌ ప్రాజెక్టుగా ఆ నియోజకవర్గాన్ని ఎంపిక చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల వంతున ఆర్థిక ప్రయోజనం కలిగించే పథకాన్ని కొనసాగించటమా? వద్దా? అనే చర్చ కొందరు పార్టీ ముఖ్యుల్లో నడుస్తోంది.

వాస్తవానికి దళిత బంధు పథకాన్ని తొలుత హుజూరాబాద్‌కే పరిమితం చేయటంతో మిగిలిన నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలపై స్థానిక దళితుల నుంచి ఒత్తిడి వచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్లు పెరిగాయి. మిగిలిన కులాల్లోని పేదలూ తమకు ఎందుకు అటువంటి పథకాన్ని అమలు చేయరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నిలదీయటం వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ అనేకసార్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

దళిత బంధు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని ముఖ్యమంత్రి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితం చూసిన తర్వాత దళితులు గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదని అర్థమైందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. దీంతో దళిత బంధును కొనసాగించాలా? వద్దా? అనే చర్చకు ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. మరి చూడాలి గులాబీబాస్ నిర్ణయం ఎలా ఉండబోతుందో?